మరోసారి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్

Update: 2019-11-19 03:56 GMT

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్నప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మండిపడుతున్నాయి.ఇది పూర్తిగా తెలుగును నాశనం చేసే కుట్ర అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో అడుగు ముందుకేసి ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తే ఒక మతాన్ని ప్రోత్సాహించడమే అని ఆరోపించారు. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.

ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదు... కానీ, తెలుగును మాతృ భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. 'జగన్ రెడ్డి గారు, 'మా తెలుగు తల్లికి' అంటూ పాడాల్సిన మీరు... తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాష సరస్వతిని అవమానించకండి అని చెబుతూ.. ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను, అలాగే పత్రికల్లో వచ్చిన వివిధ కథనాలను షేర్ చేశారు పవన్. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతూ.. ఆయన గతంలో ఇంగ్లీష్ విద్య గురించి ఓ ప్రముఖ స్కూల్ వేదికగా మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తుండటం విశేషం. 

Tags:    

Similar News