ఏపీలో చక్రబంధంలో విపక్షాలు.. పార్టీలను ఇరకాటంలో నెట్టేసిన జగన్‌ ప్రతిపాదన

Update: 2019-12-18 10:36 GMT
జగన్‌

సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనతో, తెలుగుదేశం, జనసేనలను చక్రబంధంలో బంధించినట్టయ్యిందా...? జగన్‌ ప్రపోజల్‌ ఆ రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడేసిందా...? కాదంటే ఒక ఇబ్బంది...ఔనంటే మరో ఇబ్బంది తప్పదా..? జగన్‌ త్రీ క్యాపిటల్స్‌ ప్రతిపాదనతో, టీడీపీ, జనసేనల పరిస్థితి ఏంటి? ఒకటే రాజధాని వుండాలని స్పష్టం చేసిన విపక్షాలు, మరి మిగతా రెండు ప్రాంతాలను ఒప్పించగలవా? వ్యతిరేకతను అధిగమించగలవా?

అసెంబ్లీ శీతాకాల సమావేశాల సాక్షిగా రాజధానిపై ఆటంబాంబు పేల్చారు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. ముందు నుంచి రాజధానిపై ఏదో సంచలన ప్రకటన వుంటుందనే అందరూ భావించారు. కానీ ఈ రేంజ్‌లో ప్రతిపాదనలుంటాయని మాత్రం, ఎవ్వరూ ఊహంచలేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో గేమ్‌ చేంజర్‌ అని చెప్పుకోదగ్గ ఆలోచనలు చేస్తున్నారు వైఎస్ జగన్. అమరావతి ఒక్కచోటే రాజధాని ఎందుకని, మూడు రాజధానులు రావొచ్చని తన మనసులో వున్న సంచలన ప్రతిపాదన బయటపెట్టారు జగన్.

వైఎస్ జగన్ సంచలన ప్రకటన ఆంధ‌్రప్రదేశ్‌ రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసింది. అమరావతి ఇక ఏకైక రాజధానిగా ఉండబోదని స్పష్టమైంది. అయితే, జగన్‌ ప్రతిపాదనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వుందో లేదో తెలీదు కానీ, తెలుగుదేశం, జనసేనలకు మాత్రం మామూలు ఇబ్బంది కాదు. మూడు రాజధానులంటూ, రెండు పార్టీలను త్రిశంకులో నెట్టేశారు జగన్. అమరావతి అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రపంచమంతా తిరిగిన చంద్రబాబు, ఇఫ్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇరకాటంలో పడినట్టయ్యింది.

అయితే, మూడు ప్రాంతాల్లో రాజధాని ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించారు. పరిపాలనా వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమని, అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనకు తెలుగుదేశం వ్యతిరేకం. అమరావతిలోనే రాజధాని వుండాలని పట్టుబడుతోంది టీడీపీ. ఈ నిర్ణయంతో మిగతా రెండు ప్రాంతాల్లో తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బంది తప్పదని రాజకీయ పండితుల విశ్లేషణ. తమ ప్రాంతానికి రాజధాని ఎందుకు వద్దంటున్నారని జనం టీడీపీ మీద రగిలిపోవచ్చు. వైజాగ్‌లో సెక్రటేరియట్‌ ప్రతిపాదన అనగానే, అక్కడ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనం. రాజధాని వికేంద్రీకరణకు టీడీపీ వ్యతిరేకమని తేల్చడంతో, ఉత్తరాంధ‌్ర టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యతిరేకిస్తే, సొంత ప్రాంతంలోనే ఇబ్బందికర వాతావరణం తప్పదు. జనం ఎదురు తిరిగే ఛాన్సుంది.

అటు జనసేన సైతం, జగన్‌ ప్రకటనతో ఇరకాటంలో పడినట్టయ్యింది. సేమ్‌ టీడీపీకి ఉన్న ఇబ్బందే జనసేనది కూడా. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాలనా వికేంద్రీకరణను వ్యతిరేకించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి గానీ, రాజధానుల వికేంద్రీకరణ కాదని ప్రకటించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు. హైకోర్టు రాయలసీమలో పెట్టాలని బీజేపీ మ్యానీఫెస్టోలోనే పెట్టామని కన్నా తెలిపారు. హైకోర్టు రాయలసీమలో పెడితే అమరావతిలో హైకోర్టు బెంచ్‌ పెట్టాలని సూచించారు. పూర్తి స్థాయి ప్రకటన వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

మొత్తానికి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనమైంది. ప్రధానంగా టీడీపీ, జనసేనలను ఇరకాటంలోకి నెట్టినట్టయ్యింది. అమరావతి ఒక్కటే రాజధానిగా వుండాలని, మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను ఎలా ఒప్పిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల ప్రకటన వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించినా, దాని పర్యావసనాలు స్థానిక నేతలకు తీవ్రంగా వుంటాయి. జగన్‌ ప్రతిపాదనలో రాజకీయ వ్యూహమున్నా, వికేంద్రీకరణ ప్రపోజల్‌ వున్నా, ఆలోచన ఏదైనా, మిగతా విపక్షాలకు మాత్రం అగ్నిపరీక్షే. చూడాలి, మూడు రాజధానుల ప్రకటన మున్ముందు ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రేపుతుందో.

Full View

Tags:    

Similar News