YS Jagan: మరికాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్

YS Jagan: రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కీలక భేటీ

Update: 2022-12-28 06:02 GMT

YS Jagan: మరికాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్ 

YS Jagan: ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. మరికాసేట్లో ప్రధానితో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపిక హేతుబద్ధత, విభజన హామీల అమలుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 900 కోట్ల రూపాయల నిధులను రీయంబర్స్‌మెంట్ చేయాలని నివేదికను సమర్పించనున్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని ఆమోదించేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించనున్నారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం 55 వేల 548 కోట్ల 87 లక్షలతో ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు.

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు అడహక్ విధానంతో 10 వేల కోట్లను విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి విజ్ఞాపన పత్రాన్ని అందించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న పరిసరాల్లో భూసేకరణ, ముంపు బాధితుల సహాయ పునరావాస కార్యక్రమానికి, నిర్వాసితులకు పరిహారం అందించేందుకు చొరవ తీసుకోవాలని ప్రధాని మోడీని జగన్‌ కోరనున్నారు.

ఏపీకి రావాల్సిన ఆర్థిక వనరుల సర్దుబాటులో 32 వేల 625 కోట్ల 25 లక్షల రూపాయలను అందివ్వాలని నివేదించనున్నారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రావాల్సిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్ల రూపంలో పెండింగులో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డులను అందించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నించనున్నారు. దీంతో జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని అభ్యర్థించనున్నారు. నెలవారీగా ఏపీకి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3 లక్షల టన్నులు వినియోగం కాకుండా ఉంటున్నాయని, ఇందులో కేవలం 77 వేల టన్నులు కేటాయిస్తే సరిపోతుందని నివేదించనున్నారు. కేంద్రంపై ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ నివేదించనున్నారు. కాగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. కాగా రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు సీఎం జగన్ ఈ భేటీలో కీలక విషయాలు చర్చించనున్నారు. 

Tags:    

Similar News