రోజా-ఆర్కే మధ్య పరోక్ష సమరం.. ఈ వార్‌లో ఎవరిది పైచేయి కాబోతోంది?

Update: 2020-02-07 07:39 GMT
రోజా-ఆర్కే మధ్య పరోక్ష సమరం.. ఈ వార్‌లో ఎవరిది పైచేయి కాబోతోంది?

నగరి ఎమ్మెల్యే రోజాకు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు మధ్య పరోక్ష యుద్ధం మొదలైందా? ఒకే పార్టీలో వున్నా ఇద్దరి మధ్యా సమరానికి కారణమేంటి? ఇద్దరూ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైనా, పోటాపోటీ ఎందుకు తప్పడం లేదు? ఇరువురికీ వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు, కార్పణ్యాలూ లేకపోయినా, అనివార్యంగా రణం ఎందుకు? అసలు ఏ విషయంలో వీరి మధ్య యుద్ధం జరుగుతోంది? చివరికి ఈ వార్‌లో ఎవరిది పైచేయి కాబోతోంది?

ఆర్కే రోజా...నగరి ఎమ్మెల్యే. ఆర్కే...ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసన సభ్యుడు. రోజా ఫైర్‌ బ్రాండ్‌ లీడర్ వైసీపీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు. ఆర్కే సైతం మాస్‌లీడర్‌గా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఓడించడంతో, తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించారు ఆర్కే. ఇప్పడు ఈ ఇద్దరు మాస్‌ లీడర్ల మధ్య, ఒక పరోక్ష యుద్ధం జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఒకే పార్టీలో వుంటూ, నువ్వానేనా అన్నట్టుగా సమరం సాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీలోనే వుంటున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. అయినా వీరిద్దరి మధ్య ఏ విషయంలో సమరం సాగుతోందంటే, మంత్రి పదవి విషయంలో.

ఔను. మంత్రి పదవిపై వీరిద్దరి నడుమ పరోక్షంగా యుద్ధం జరుగుతోందన్న మాటలు వినపడ్తున్నాయి. శాసనమండలి రద్దయితే, మంత్రులు పిల్లి సుభాష్‌, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయక తప్పదు. దీంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు రోజా, ఆర్కే.

రోజాకు మంత్రి పదవి ఖాయమని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారీ ఎత్తున ప్రచారం జరిగింది. హోంమంత్రి పదవి ఇస్తారన్న చర్చా సాగింది. రోజా వాగ్దాటి, మహిళ కావడంతో, తప్పకుండా మినిస్ట్రీ దక్కుతుందన్న అంచనాలు పెరిగాయి. జగన్‌కు సైతం రోజా సన్నిహితురాలు కావడంతో, ఈ ప్రచారానికి మరింత బలం తోడైంది. కానీ సామాజిక సమీకరణాల కారణంగా, అనూహ్యంగా రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు జగన్. దీంతో ఆమె అలిగారు. చివరికి జగన్‌ దగ్గరకు పంచాయతీ చేరింది. క్యాంప్‌ ఆఫీసుకు పిలిపించుకున్న సీఎం, త్వరలో మంత్రి పదవి ఖాయమని హామి ఇచ్చారట. అంతవరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా వ్యవహరించాలని కోరారట. దాంతో రోజా అలకకు అక్కడితో స్టాప్‌ పడింది. ఇప్పడు రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతుండటంతో, ఒకటి తనకేనన్న నమ్మకంతో వున్నారట రోజా.

ఇప్పటికైనా తనకు మంత్రి పదవి అవకాశమివ్వాలని కోరుతున్నారట రోజా. ఆమె ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలున్నాయన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఇటీవలె చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న రోజా, తనకు మంత్రియోగంపై చాలా ఆశలు పెట్టుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రోజాకు, ఆర్కే రూపంలో పోటీ పడిందన్న చర్చా వినిపిస్తోంది. అదే రోజాను రోజా అదృష్టాన్ని గందరగోళం చేస్తోందట.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారం టైంలోనే, జగన్‌ ఆర్కేకు హామి ఇచ్చారు. ఆర్కే గెలిస్తే, మంత్రి అవుతారని క్యాంపెయిన్‌‌లో మాట ఇచ్చారు. ఆర్కే గెలిచారు. అందులోనూ లోకేష్‌పై విజయఢంకా మోగించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో ఆ‍యనకు మంత్రి పదవి ఖాయమన్న అంచనాలు పెరిగాయి. కానీ క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌‌ రూపంలో ఆర్కేకు మంత్రి యోగం దక్కలేదు. అయితే, రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతుండటంతో, ఈసారి మాత్రం ఆర్కేకు జగన్ అవకాశమిస్తారన్న చర్చ జరుగుతోంది.

మోపిదేవి వెంకటరణమ గుంటూరు జిల్లా వాసే. దీంతో ఆయన మంత్రి పదవిని అదే జిల్లా ఎమ్మెల్యేతోనే భర్తీ చేస్తే మాత్రం, ఆర్కేకే లభించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. అయితే, రోజా కూడా మినిస్ట్రీ ఆశిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య అనివార్యంగా పోటీ ఏర్పడుతోంది.

ఇద్దరి మధ్యా ఎందుకు పోటీ అంటే భర్తీ చేయాల్సినవి రెండు మంత్రి పదవులు. రోజా, ఆర్కే ఇద్దరూ ఆశిస్తున్నారు. కానీ ఇద్దరూ రెడ్డి సామాజికవర్గమే. కానీ ఖాళీ కాబోతున్నవి బీసీ వర్గం నేతలవి. ఒకవేళ భర్తీ చేస్తే, బీసీ నేతలతోనే చెయ్యాలి. ఒకవేళ ఒకటి బీసీలకు, మరోటి రెడ్డి వర్గానికి ఇవ్వదలిస్తే, మాత్రం ఇద్దరి మధ్యా పోటీ తప్పదు. ఆర్కే, రోజా ఇద్దరూ రెడ్డి సామాజికవర్గమే కాబట్టి, ఒకరికే ఛాన్స్ దొరికే ఛాన్సుంది. అందుకే వీరివురి నడుమా పరోక్షంగా యుద్ధం తప్పడం లేదు.

మొత్తానికి ఆర్కే రోజాకు, ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్య మంత్రి పదవి కోసం వార్‌ అయితే సాగుతోంది. కానీ బీసీ నేతలు ఖాళీ చేస్తున్న మంత్రి పదవులు కాబట్టి, బీసీలతోనే భర్తీ చేస్తారా, లేదంటే ఒక పదవి రెడ్డి వర్గంతోనో, మరో వర్గంతోనో ఫిలప్ చేస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. చూడాలి, ఏం జరగబోతోందోఎవరి అదృష్టం పండబోతోందో ఇద్దరికీ మరోసారి నిరాశ తప్పదో.


Full View


Tags:    

Similar News