ఆసక్తి రేపుతున్న మాగుంట-కరణం బలరాం కలయిక..దీని వెనక ఇంట్రెస్టింగ్‌ బ్యాగ్రౌండ్ స్టోరి ఏంటి?

Update: 2019-10-16 08:05 GMT

ఆయన ఒక బర్త్‌ డే పార్టీకి వెళ్లాడు. గిఫ్ట్‌ ఇచ్చాడు. కేక్‌ తిన్నాడు. స్మైల్‌ ప్లీజ్‌ అనగానే కెమెరాకు మాంచి లుక్కు కూడా ఇచ్చాడు. తన కొడుకును సైతం, ఆ ఫంక్షన్‌కు తీసుకెళ్లి, బర్త్‌ డే బాయ్‌కు పరిచయం చేయించాడు. కలుపుగోలుగా అందరితోనూ మాట్లాడి, సందడి సందడి చేశాడు. కానీ ఆయన ఆ పుట్టిన రోజు వేడుక వెళ్లడంతో, ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. మీడియాలో హైలెట్‌ అయ్యింది. పార్టీ అధినేతకు, కోపం కూడా వచ్చింది. అసలు, బర్త్‌ డే వేడుకకు వెళ్లడమూ, ఒక తప్పేనా చివరికి పార్టీ అధ్యక్షుడు కూడా సీరియస్‌ అయ్యేంత పాపమా వినడానికి చాలా విడ్డూరంగా వుంది కదా. ఇంతకీ పుట్టినరోజు ఎవరిదో తెలుసా ఆ వేడుక ఇంత రాద్దాంతం ఎందుకవుతుందో తెలుసా లెట్స్‌ గోటు ది, బర్త్‌ డే పార్టీ.

బర్త్ ‌డే మాగుంట శ్రీనివాస రెడ్డిది. ఈయన ఒంగోలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఫంక్షన్‌కు అటెండయ్యారు. అంతవరకు బాగానే వుంది. వాళ్లంతా వైసీపీ నేతలే. కానీ చీరాల టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు నమ్మిన బంటు కరణం బలరాం కూడా, ఈ ఫంక్షన్‌కు అటెండయ్యారు. అదే ఇప్పుడు, పొలిటికల్ వర్గాల్లో, హాట్‌హాట్‌ డిస్కషన్‌కు కారణమైంది. కరణం బలరాం, తనతో పాటు కొడుకు కరణం వెంకటేష్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. కరణం బలరాం ఇలాంటి పంక్షన్‌లకు చాలానే వెళుతుంటారు. అందులోనూ మాగుంట శ్రీనివాస రెడ్డితో కరణంది బలమైన అనుబంధమే. కానీ, ఈ బర్త్ డే వేడుకలో, కరణం, ఆ‍యన కుమారుడు అటెండ్ కావడం, ఇంత కాంట్రావర్సీ కావడం వెనక, కొన్ని విశేషాలు, కనపడని కొన్ని రాజకీయాలున్నాయని అంటున్నారు పొలిటికల్‌ పండితులు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బర్త్ డే పార్టీకి కరణం బలరాం, ఆయన కుమారుడు వెళ్లడం, పార్టీ అధినేత చంద్రబాబుకు దృష్టికీ వెళ్లిందట. ప్రత్యర్థి పార్టీ ఎంపీ వేడుకకు డైరెక్టుగా వెళ్లడమేంటని, చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారట. ఇంకొందరైతే, కరణం బలరాం, ఆయన కుమారుడు వైసీపీలోకి వెళ్లడం ఖాయమని, మాగుంట వేడుకకు హాజరుకావడం అందులోని భాగమేనని, చంద్రబాబు ఎదుట అనుమానాలు వ్యక్తం చేశారట కొందరు తెలుగు తమ్ముళ్లు. బయట కూడా ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో, చంద్రబాబు సీరియస్‌గా స్పందించారట. ఇన్ని అనుమానాల వెనక, బ్యాగ్రౌండ్‌ స్టోరి కూడా చాలా బలంగానే వుంది.

ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతల్లో పెద్దాయనగా పేరున్న కరణం బలరాం, ఆ పార్టీని వీడి వైసీపీ లోకి వెళతారన్న ఊహాగానాలు మూడు నెలలుగా బలంగానే వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ లో మరోవర్గం ఎమ్మెల్యేల చేరిక వైసీపీలో ఆగింది కాబట్టి, ఆయన స్థానంలో బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం కూడా, అంతే స్థాయిలో జరుగుతోంది. మాగుంట ద్వారా, తన కుమారుడికి లైన్‌ క్లియర్‌ చేయించాలని కరణం భావిస్తున్నారట. అందుకే మాగుంట బర్త్ డే వేడుకకు, తన కుమారుడిని సైతం తీసుకెళ్లి మాట్లాడించారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే బర్త్‌ డే ఫంక్షన్‌కు అటెండ్ కావడం, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత ఎన్నికలకు ముందే, కరణం బలారం టీడీపీని వీడి వైసీపీలో వెళతారన్న ప్రచారం గట్టిగానే సాగింది. దీంతో చంద్రబాబే రంగప్రవేశం చేసి, కరణంను ఆపారట. చీరాల నియోజకవర్గం నుంచి బలరాంకు, టికెట్‌ ఇవ్వడంతో, అప్పటికప్పడు పార్టీ మార్పు నిర్ణయంపై వెనక్కి తగ్గారట కరణం బలరాం. అయితే, టీడీపీ పెద్ద నేతల్లో ఒకరు, కమ్మ సామాజికవర్గానికి చెందిన కరణం బలరాంను తీసుకుంటే, ఆవర్గానికి సైతం పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని భావించిందట వైసీపీ. అద్దంకి నుంచి బరిలో దించాలి ఆలోచించిందట. అందుకే చివరి దాకా, అద్దంకికి అభ్యర్థిని ప్రకటించలేదన్న వాదన వుంది. చీరాలలో కరణంకు టీడీపీ టికెట్‌ ఇవ్వడంతో, లాస్ట్‌లో అద్దంకిలో హడావుడిగా అభ్యర్థిని ఖరారు చేసిందట వైసీపీ. అప్పటి నుంచి వైసీపీ చూపు బలారం వైపు, బలరాం మనసు వైసీపీ వైపు లాగుతోందన్న చర్చ నడుస్తోంది.

రాజీనామా చేసిన తర్వాతే, ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారాలని జగన్‌, ప్రిన్సిపుల్ పెట్టుకోవడం కూడా, కరణం కాళ్లకు బంధనాలు వేసింది. ఇప్పటికిప్పుడు తాను వైసీపీలోకి వెళ్లకపోయినా, మొదట తన కుమారుడు వెంకటేష్‌నైనా పంపించాలని అనుకుంటున్నారట కరణం. అందుకే, రకరకాలుగా వైసీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగానే, ఎవరికీ అనుమానం రాకుండా, మాగుంట బర్త్‌ డే వేడుకకు, కుమారుడిని తీసుకెళ్లారట. బర్త్‌ డే ఫంక్షన్‌ ఇంతగా కాంట్రావర్సీ కావడం వెనక, ఇదీ అసలు కథ. మరి ఈ కథకు కరణం బలరాం రూపమిస్తారో, నాలుగేళ్లు పక్కనపెట్టేస్తారో కాలమే చెప్పాలి.

Full View 

Tags:    

Similar News