AP Inter Exams: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
AP Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం నివేదికను ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఫైల్ ఫోటో
AP Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం నివేదికను ఇవ్వనుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణను పునరాలోచించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇంటర్ పరీక్షలను.. వాయిదా వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేయకుండా.. వాయిదా వేసి, పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది ఏపీ సర్కార్. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం, హైకోర్టుకి తెలపనుంది. నేడు ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఇంటర్ బోర్డు. ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకు కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు.ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.