Pawan Kalyan: సింగిల్‌గానే మింగిల్‌ అవుతారా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పొలిటికల్ జర్నీపై అటు జన సైనికుల్లోనే కాదు, ఇటు పవన్ అభిమానుల్లోనూ చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.

Update: 2021-10-14 06:32 GMT

Pawan Kalyan: సింగిల్‌గానే మింగిల్‌ అవుతారా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై అటు జన సైనికుల్లోనే కాదు, ఇటు పవన్ అభిమానుల్లోనూ చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓసారి పోటీకి దూరంగా ఉంటే మరోసారి జనం, ఆ పార్టీని దూరం పెట్టారు. అందుకే అవసరమైనపుడు వ్యూహం మారుస్తానని చెప్పిన పవన్ కొత్త వ్యూహం ఈసారి ఎలా ఉండబోతోందన్న చర్చ కనిపిస్తోంది. ఇప్పటికే ఆ మేరకు జనసేనాని ఓ నిర్ణయం తీసుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఆ టాక్ ఏంటి? పవన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో జరుగుతోన్న చర్చ ఏంటి?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఓ పట్టాన ఎవరికీ అంతుబట్టదు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు సడన్‌గా తెరపైకి వచ్చే ఎత్తుగడలు అవసరానికి పొడుచుకునే పొత్తులు కనిపించని వెన్నుపోట్లు, కనిపించే సిగపట్లు ఇదీ సగటు రాజకీయ చిత్రం. ఇలాంటి ఇంట్రస్టింగ్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా కనబడే ఏపీలో కూడా ప్రతి ఎన్నికలకూ ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పాలిటిక్స్‌కు సినీ గ్లామర్ యాడ్ అయితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వరకూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. అలాగే పాపులర్ యాక్టర్స్‌గా ఉన్న మరి కొంతమంది పాలిటిక్స్‌లో అలా ఎంట్రీ ఇచ్చి ఇలా ఎగ్జిట్ అయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు.

దీంతో, సినిమాల పట్ల ఉండే సహజమైన ఇంట్రెస్ట్ వల్ల తమ అభిమాన హీరోలు చేసే రాజకీయాల పట్ల కూడా అభిమానులు అదే స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకు ఫ్లాప్‌టాక్ వస్తే నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూసినట్లే ఒక ఎన్నికల్లో తమ అభిమాన నాయకుడి పార్టీ ఓటమి పాలైతే ఆ నెక్స్ట్ ఎన్నికల కోసం మళ్లీ ఎదురుచూడటం కామనైపోయింది. పవన్ స్థాపించిన జనసేన పార్టీపై ఎప్పుడూ ఏవో ఒక అంచనాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. 2014లో పార్టీ స్థాపించి నాడు పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన జనసేనాని, మొన్నటి 2019 ఎన్నికలకు వామపక్షాలు, బీఎస్పీలతో కలసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే జగన్ హవాలో కేవలం ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకున్న జనసేన, చివరకు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతుగా మారిపోవటంతో జీరో దగ్గరే ఆగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోన్న పవన్, వైసీపీపై ఎదురుదాడే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో చేస్తోన్న దోస్తీకి త్వరలోనే ముగింపు పలికి మళ్లీ టీడీపీకి స్నేహహస్తం అందిస్తారన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈసారి సింగిల్‌గానే బరిలో దిగాలన్నది జనసేనాని ఆలోచనగా తెలుస్తోంది.

గతంలో టీడీపీ, బీజేపీలతో దోస్తీ కట్టినపుడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైఫల్యాలు జనసేనను వెంటాడాయి. దీంతో ఆ పార్టీకి కటీఫ్ చెప్పి 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఇద్దరి మధ్యా అండర్ స్టాండింగ్ ఉందన్న విమర్శలకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రతికూల ఫలితాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం బీజేపీతో దోస్తీ చేయటం వల్ల తమకు రాజకీయంగా వచ్చే మైలేజ్ ఏం లేదన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రానికి ఉపయోగపడే కీలక అంశాలపై కేంద్రం అనుసరిస్తోన్న నిరాదరణ వైఖరి వల్ల బీజేపీ మసి జనసేనకు అంటుకునే ప్రమాదం ఉందని ఆ పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు మళ్లీ ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీతో కలిసి బరిలోకి దిగినా ఫలితాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయని వారు భావిస్తున్నారట.

రాయలసీమలో కొన్ని చోట్ల మినహా రాష్ట్రమంతటా మనకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందనీ, అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళ్తే విజయం వరిస్తుందని చెబుతోన్న మాటల్ని విన్న జనసేనాని ఆలోచనలో పడ్డారట. పవర్‌స్టార్‌నే కానీ పవర్ లేదని ఒకప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటే ఈసారి వదిలేదేలే అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారతాయి జనసేన ప్రభుత్వం వస్తుంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంది వ్యూహంలో భాగంగానే అని పవన్ చెప్పటం వెనక కూడా ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సంకేతమని పార్టీ క్యాడర్ భావిస్తోందట.

ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది కాబట్టి ముందు పార్టీ నిర్మాణంపైనా, ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయటం పైనా దృష్టి పెట్టిన పవన్ ప్రస్తుతానికైతే వచ్చే ఎన్నికల నాటికి సింగిల్‌గానే వెళ్లి జనంతో మింగిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. జనం తమను ఓన్ చేసుకోవాలంటే అమలు చేయాల్సిన స్ట్రాటజీపైనే ఇప్పుడు పవన్ కసరత్తు చేస్తున్నారట. మరి పవన్ వ్యూహాలు, ఈసారైనా ఫలిస్తాయా? అభిమానుల్ని ఆకట్టుకునే పవన్ ఈసారి ఓటర్లు తనను అక్కున చేర్చుకునేలా పని చేస్తారా? ఈ ఇంట్రెస్టింగ్ సందేహాలకు పవన్ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Tags:    

Similar News