ఆ విషయంలో హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఏ వివరణ ఇస్తుందో!

Update: 2019-11-16 03:12 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చిందా? రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశయమైన అంశం. స్థానిక సంస్థ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఎన్నికలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుకు తెలిపింది. త్వరలో వీటికి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. అయితే దీనిపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు గరిష్టంగా 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఎలా సమర్ధించుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థలకు రాబోయే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 60 శాతం సీట్లు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ కందేటి నవీన్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎపి పంచాయతీ రాజ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం చేస్తోంది రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తప్పించాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో అని ఆసక్తి నెలకొంది. 

Keywords : High Court, AP government, 60 quotas, Local body Election, Andhra Pradesh


Tags:    

Similar News