Rain Alert: తిరుమల, తిరుపతి మునగడానికి కారణాలేంటీ?

*చిన్నపాటి వర్షాలకే అస్తవ్యస్థంగా మారుతోన్న ఆధ్యాత్మిక నగరం *ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు

Update: 2021-11-19 03:39 GMT

ఆక్రమణకు గురైన తిరుపతిలోని పలు ప్రాంతాలు(ఫోటో- ది హన్స్ ఇండియా) 

Rain Alert: తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతలు జలమయమయ్యాయి.

శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆధ్యాత్మిక నగరం చిన్నపాటి వర్షాలకే అస్తవ్యస్థంగా మారుతోందని తిరుపతి వాసులు వాపోతున్నారు.

స్మార్ట్‌ సిటీ పేరుకే తప్ప ఆచరణలో ఆ ఆనవాళ్లే కనబడటం లేదంటున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న ఈ వరద బీభత్సానికి కారణాలేంటీ..?

దేశంలోకి మే చివరి రోజుల నుంచి జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. క్రమంగా విస్తరించుకుంటూ దేశమంతటా వర్షాలు కురిపిస్తాయి. అయితే తమిళనాడు తీరప్రాంతంలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని తూర్పు ప్రాంతాలు, నెల్లూరు జిల్లా ప్రాంతాలపై ఈ రుతుపవనాల ప్రభావం ఉండదు.

నైరుతి రుతుపవనాలు హిమాలయాలకు వెళ్లి వాటిని దాటలేక తిరిగి వెనక్కు వస్తాయి. అయితే వెళ్లిన దారిలో కాకుండా బంగాళాఖాతం మీదుగా పయనిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలు అనికూడా అంటారు. నవంబరు నెలలో ఇవి బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ఈ ప్రభావంతో అప్పుడప్పుడు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతాయి.

దీంతో సాధారణంగా చిత్తూరు జిల్లాలో కురిసే వర్షాలు భారీగా మారుతాయి. ఫలితంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఏటా ఇలాంటి వర్షపాతం నమోదుకాదు. కానీ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అల్పపీడనాలు తోడు కావడంతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతానికి సమీపంలో ఉండటంతో వర్షాల ప్రభావం తిరుపతి నగరంపై ఉంటుంది. తిరుపతి నుంచి తడ 100 కిలోమీటర్లలోపు దూరం మాత్రమే ఉంది. మరోవైపు రాయలవారి కాలంలో తిరుపతిలో అనేక గుంటలను తవ్వించారు.

కానీ తుమ్మలగుంట, కేశవాయనగుంట, మల్లయ్య గుంట, తాతయ్యగుంట, తాళ్లపాక చెరువు, కొరమీనుగుంట తదితర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఆర్టీసీ బస్టాండును తాళ్లపాక చెరువుపై, కూరగాయల మార్కెట్‌ను మల్లయ్య గుంటపై నిర్మించడంతో వర్షపునీరు రోడ్లపైకి వస్తోంది. అక్కడే ఉన్న పెద్ద జలవనరు తాతయ్యగుంట పూర్తిగా మాయమైంది.

కపిలతీర్థం, మాల్వాడిగుండం నుంచి వచ్చే జలపాతం నీరంతా తిరుపతికి అడ్డంగా ప్రవహించి తిరుచానూరు దక్షిణ భాగంలోని స్వర్ణ ముఖి నదిలో కలుస్తుంటుంది. అయితే ఈ కాల్వలన్నీ కుచించుకుపోవడంతో కాలువల్లో ప్రవహించేనీరు రోడ్లపైకి చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాల గృహాలన్ని నీటమునుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

తిరుపతి నగరం భౌగోళికంగా భిన్నమైంది. పడమర, తూర్పు ప్రాంతాలు ఎత్తుగా ఉంటాయి. ఉత్తర ప్రాంతం కొండలు. నీరు దక్షిణంగా ప్రవహించాలి. అయితే జలవనరుల విధ్వంసంతో వరదనీరు అక్కడే నిలిచిపోతోంది.

తిరుమల గిరుల్లో కురిసిన వర్షపునీటితో మల్వాడి గుండం పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఆక్రమణల్లో ఉన్న వర్షపునీటి కాలువల్ని పునరుద్ధరిస్తే తప్ప తిరుపతి నగరం ముంపు నుంచి బయటపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News