Pulichinthala Project: పులిచింతలకు కృష్ణమ్మ పరుగులు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

Pulichinthala Project: వరదలతో పాటు వరుస అల్పపీడన ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై పడుతోంది...

Update: 2020-08-23 04:44 GMT

Pulichinthala Project: వరదలతో పాటు వరుస అల్పపీడన ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై పడుతోంది... వీటికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ విధంగా ఒకదాని నుంచి మరొకటి, దాని నుంచి వేరొకటి ఇలా ఒక్కొక్కటి వరద తాకిడికి నిండుకుంటూ వస్తున్నాయి. చివరిగా పులిచింతలకు ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇలా ఒక్కసారే లక్షల క్యూసెక్కుల్లో నీరు వచ్చి చేరుతుండటంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు.

శ్రీశైలం వయా నాగార్జున సాగర్ మీదుగా పులిచింతలకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ వస్తోంది. అంచలంచెలుగా తన ఉధృతిని పెంచుకొంటూ ఉరకలేస్తోంది. అప్రమత్తమైన అధికారులు తొలుత ఆరుగేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్‌కి నీటిని విడుదల చేసారు. వరద ప్రవాహం పెరిగిపోవటంతో నీటి విడుదల శాతాన్ని అంచలంచెలుగా పెంచుతున్నారు. 17 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ నుంచి 3 ,50 ,000 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3,50,000 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. పులిచింతల పూర్తి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ఢి ఆదేశాలతో పరిస్థితిని కలెక్టర్ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌పై సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసారు. ముంపుకు గురయ్యే ముక్త్యాల, రావెల, చందర్లపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ,పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత తహశీల్దార్లకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.  

Tags:    

Similar News