Visakhapatnam: విశాఖలో టీడీపీ నేత పల్లా భవనం కూల్చివేత

Visakhapatnam: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు.

Update: 2021-04-25 03:30 GMT

TDP Leader Palla Srinivas:(File Image)

Visakhapatnam: విశాఖపట్నంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే... అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. సమాచారం తెలుసుకుని శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి సమయంలో భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. 2020 జూలై లో భవన నిర్మాణానికి పొందిన అనుమతుల ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత అక్విజిషన్ మేరకు రహదారి నిర్మాణానికి స్థలాన్ని వదిలేసి నిర్మాణాన్ని జరుపుతున్నామన్నారు. కానీ భవిష్యత్ లో రహదారికోసం చేపట్టబోయే స్థల సేకరణ కోసం అని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం చేసినట్లు జీవిఎంసీ అధికారులు తెలిపారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదంటూ బిల్డింగ్ కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. సమాచారం ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం దారుణమని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. పల్లా శ్రీనివాస్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.



Tags:    

Similar News