విశాఖలో ఐటీ సంస్థల నిర్మాణానికి భూమి పూజలు

విశాఖలో పలు ఐటీ సంస్థల నిర్మాణానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమిపూజలు చేశారు

Update: 2025-12-12 08:18 GMT

విశాఖపట్నం: విశాఖలో పలు ఐటీ సంస్థల నిర్మాణానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమిపూజలు చేశారు. ముందుగా మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ ప్రాంగణానికి చేరుకున్న ఆయన, ఆ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను అందిస్తోంది.

నాన్ రెల్ టెక్నాలజీస్ : అనంతరం, విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్-2లో నాన్ రెల్ టెక్నాలజీస్ (Nonrel Technologies Private Limited) యూనిట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. విశాఖలో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఏసీఎన్ ఇన్ఫోటెక్: విశాఖ ఐటీ సెజ్ హిల్ నెం-2లో ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ACN HealthCare RCM Services Pvt Ltd) కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్ సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.

ఈ కార్యక్రమాలలో టెక్ తమ్మిన సీఈవో రాజ్ తమ్మిన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కేవీఎస్జేవీ శాస్త్రి, నాన్ రెల్ టెక్నాలజీస్ ఎండీ వినయ్ బాబు మేక, సీఈవో పవన్ కుమార్ సామినేని,ఏసీఎన్ ఇన్ఫోటెక్ సీఈవో చమన్ బేడ్, సీటీవో అమవ్ బేడ్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News