ఏడాది క్రితమే రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు.. ఆమోదించని గవర్నర్

Ganta Srinivasa Rao: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఆమోదిస్తారా..? పెండింగ్‌లో ఉంచుతారా..?

Update: 2023-12-12 14:45 GMT

ఏడాది క్రితమే రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు.. ఆమోదించని గవర్నర్

Ganta Srinivasa Rao: వైసీపీలో ఎమ్మెల్యేలెవరూ సంతృప్తిగా లేరనీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కన్ఫర్మ్ కాదన్న ఆందోళన దాదాపుగా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉందనీ కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే విషయంలో ఎలాంటి సంకోచాలూ... మొహమాటాలూ లేకుండా వ్యవహరించారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ... తమ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారు. నేడో రేపో వారంతా పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతూనే ఉంది.

ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నిజమే. ఎమ్మెల్యేల వలస ఎంతో దూరంలో లేదు అన్న స్పష్టత వచ్చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. కొద్ది కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. పార్టీకి రాజీనామా చేసేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ లభించదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆళ్ల... ఏ మాత్రం ఉపేక్షించకుండా పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

స్పీకర్ ఫార్మాట్‌లోనే ఆళ్ల ఆ రాజీనామా లేఖ అందించేసినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. మంగళగిరి వైసీపీ ఇంచార్జిగా గంజి చిరంజీవిని నియమించనుండడం, గంజి చిరంజీవి మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న భావనకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించి జాయంట్ కిల్లర్‌గా సంచలనం సృష్టించారు.

అప్పట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే లోకేష్‌ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీని విస్మరించి తొలి క్యాబినెట్‌లో కానీ, ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలో కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న ఆయన... ఇప్పుడు రానున్న ఎన్నికల్లో టికెట్ కూడా హుళక్కే అని తేలడంతో రాజీనామా చేశారు. కానీ ఇంతవరకూ ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించ లేదు. స్పీ్కర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసినా ఆమోదించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసవగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా.... అయితే ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో చేయలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో స్పీకర్ ఫార్మాట్‌లో మరోసారి రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. కానీ రాజీనామా చేసి ఏడాది గడిచినా ఏపీ గవర్నర్ రాజీనామా ఆమోందించలేదు.. ఇందుకు కారణాలు అనేకమున్నా.. రానున్న మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పడు వీరిద్దరి రాజీనామా ఆమోదించినా.. వెంటనే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఏదేమయినా స్పీకర్ ఫార్మాట్‌లో గంటా రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించ లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశానని చెప్పిన గంటా... కార్మిక సంఘాలకు అండగా నిలుస్తున్నారు. అంటే తాను రాజకీయంగా ఇంకా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాననే సంకేతాలు ఇస్తున్నారని అర్థమవుతోంది.

Tags:    

Similar News