నేడు కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖలోని కాపులుప్పాడ సమీపంలోని ఐటీ హిల్స్ వద్ద ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
అమరావతి: విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించనున్నారు. విశాఖలోని కాపులుప్పాడ సమీపంలోని ఐటీ హిల్స్ వద్ద ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ఐటీ జోన్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సంస్థ కార్యకలాపాలను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు.
మరోవైపు ఇదే సమయంలో మంత్రి లోకేష్ విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ లో మరో 8 సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఒకేసారి నూతన కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్ప్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనున్నాయి. కాగ్నిజెంట్ సహా ఈ సంస్థలు రూ.3,740 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చిస్తారు. 9 జిల్లాల అధికారులు, మంత్రులు ప్రజాప్రతినిధులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరవుతారు.
సంస్థల వివరాలు:
1. టెక్ తమ్మిన (Tech Tammina (Sree Tammina Software Solutions Pvt. Ltd) : విశాఖ మధురవాడలోని ఎస్పీఎల్-4, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న టెక్ తమ్మిన సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను అందిస్తోంది.
2. నాన్ రెల్ టెక్నాలజీస్(Nonrel Technologies Private Limited): విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
3. ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ACN HealthCare RCM Services Pvt Ltd): విశాఖ ఐటీ సెజ్ హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్ సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.
4.ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd): విశాఖ భీమిలిలోని కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
5. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited): విశాఖ భీమిలి మండలం కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
6. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited): విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో ఏర్పాటుకానున్న మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ రూ.109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
7. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Quarks Technosoft Pvt Ltd): విశాఖ కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
8. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ : 1986లో సత్వా గ్రూప్ ను నెలకొల్పారు. దేశ ఆధునిక రియల్ ఎస్టేట్, టెక్నాలజీ మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ముంబై నగరాల్లో ఇప్పటి వరకు 78 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తిచేసింది. మరో 71 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. విశాఖలో మొదటి మూడేళ్లలో ఒక మిలియన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీస్ స్పేస్ ను సత్వా సంస్థ అభివృద్ధి చేయనుంది. అదేవిధంగా వచ్చే ఐదేళ్లలో 4 మిలియన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీస్ స్పేస్ ను విశాఖలో అభివృద్ధి చేయనుంది. ప్రతిభ సమృద్ధి, ఆర్థిక వేగం, పురోగామి పాలన కలిగిన అధిక వృద్ధి సామర్థ్య మార్కెట్లలో ఈ గ్రూప్ వ్యూహాత్మకంగా తన విస్తరణను కొనసాగిస్తోంది.