టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామభూపాల్ రెడ్డి కన్నుమూత

Update: 2025-12-11 05:26 GMT

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు. వయసు రీత్యా కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ భూపాల్ రెడ్డి ఈరోజు తుదిశ్వాస విడిచారు.

1994లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి రామ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఉన్నారు.

రామ భూపాల్ రెడ్డి మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు కీలక రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో నిర్వహిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News