GVMC: సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్‌ మోడల్‌

GVMC: మేహాద్రి గెడ్డపై మరో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు

Update: 2022-07-22 01:51 GMT

GVMC: సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్‌ మోడల్‌

GVMC: సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్‌ మోడల్‌గా వ్యవహరిస్తోంది. తన పరిధిలోని అన్ని వ్యవస్థల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగిస్తోంది. వినూత్నంగా ఆలోచిస్తూ విద్యుత్‌ బిల్లులు ఆదా చేస్తోంది. పైగా కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముడసర్లోవ రిజర్వాయర్‌లో తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన కార్పొరేషన్ తాజాగా మేహాద్రిగెడ్డపై మరో ప్లాంట్‌ను పూర్తి చేసింది.

సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఏకంగా 7 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తయ్యేలా వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. తమ పరిధిలో ఉన్న జీవీఎంసీ భవనాలపై విద్యుత్‌ సౌరభాలు పూయిస్తోంది. నీటిపై సౌర ఫలకలు తేలియాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును జీవీఎంసీ ఏర్పాటు చేసింది.

ముడసర్లోవ రిజర్వాయర్‌లో 11కోట్ల 37లక్షలతో 2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మించింది. దేశంలో తొలి అతి పెద్ద ప్రాజెక్టుకు బెస్ట్‌ స్మార్ట్‌ సిటీ ఇన్నోవేషన్‌ అవార్డు దక్కింది. ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాజెక్టును మేహాద్రి గెడ్డపై ఏర్పాటు చేసి, ఔరా అనేలా చేసింది. 2019 డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, ఈ ఏడాది మార్చిలో దీనిని పూర్తి చేశారు. 14 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు సిద్ధమైంది. తడిచినా తుప్పుపట్టని, జర్మన్‌ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు.

గుర్‌గావ్‌కు చెందిన రెన్యూ సోలార్‌ సిస్టమ్‌ ప్రై. లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుంది. కానీ మేహాద్రి రిజర్వాయర్‌లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. ఆధునిక కాలంలో కరెంట్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అందుకే సౌర విద్యుత్‌పై దృష్టిసారించారు జీవీఎంసీ అధికారులు. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల పాటు అప్పగించారు. 

Tags:    

Similar News