Flamingo Festival 2026: పక్షుల పండుగతో పులికాట్ కళకళ
Flamingo Festival 2026: పులికాట్ సరస్సు తీరంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్-2026 పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
Flamingo Festival 2026: పక్షుల పండుగతో పులికాట్ కళకళ
పక్షుల పండుగతో పులికాట్ కళకళ - పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న'ప్లెమింగో ఫెస్టివల్'. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం సందర్శకులతో కిటకిట - పర్యాటకులతో కళకళలాడుతోన్న పులికాట్ సరస్సు - రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి వస్తోన్న సందర్శకులు.
తిరుపతి జిల్లాలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 180 రకాల పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి వలస వస్తాయి. ఈ ఫెస్టివల్ కోసం రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి తరలివచ్చిన సందర్శకులు బోట్ షికారుతో సందడి చేశారు. చిన్నా పెద్దా అంతా బోట్ రైడ్‌ను ఆస్వాదించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశ విదేశాల నుంచి వచ్చే రంగురంగుల పక్షుల కిలకిలరావాలతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్-2026 జరిగాయి. నేలపట్టు పక్షుల కేంద్రంలో విదేశీ అతిథుల సందడి నెలకొంది. సైబీరియా, యూరప్ దేశాల నుంచి వేల కిలోమీటర్లు దాటి వచ్చిన ఫ్లెమింగోలు, పెలికాన్లు, కింగ్‌ఫిషర్లు వంటి 200 రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి. నేలపట్టు నుంచి పులికాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో సందర్శకులు సులభంగా చేరుకోగలుగుతున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదని పర్యావరణం, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించే వేదిక అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో, పక్షుల కిలకిల రావాల మధ్య గడపడం మంచి అనుభూతి కలిగిస్తోందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పులికాట్ సరస్సు తీరంలో ఈ నెల మూడ్రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. ఈ పక్షుల పండగను ముందుగా రెండు రోజులే నిర్వహించాలనుకున్నా సందర్శకుల రద్దీ దృష్ట్యా మరో రోజుకు పెంచినట్లు చెప్పారు. పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి: ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 180 రకాల పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి వలస వస్తాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ పక్షులకు ఆహార కేంద్రంగా ఉంటే, నేలపట్టు చెట్లు వాటి విడిదికి, సంతానోత్పత్తికి ఆలవాలంగా మారాయి. గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలతో తిరిగి తమ దేశాలకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు, ముఖ్యంగా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సందర్శకుల సౌకర్యార్థం నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. పక్షుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నేలపట్టు కేంద్రం ఇప్పుడు విదేశీ పక్షులతో సందడిగా మారింది. సైబీరియా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వేల సంఖ్యలో పక్షులు వలస వచ్చి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రే పెలికాన్, వైట్ ఐబిస్, లిటిల్ కార్మరెంట్, ఓపెన్ బిల్ స్టార్క్, స్పూన్ బిల్ స్టార్క్ వంటి వివిధ రకాల అరుదైన విదేశీ పక్షులు విడిది చేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో పక్షుల పండగను నిర్వహిస్తున్నామని తిరుపతిజిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో 'ఫ్లెమింగో ఫెస్టివల్- 2026' నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు పులికాట్ సరస్సు ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించామని, గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను పునరుద్ధరించి స్టేట్ ఫెస్టివల్‌గా, మెగా ఫెస్టివల్‌గా ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది మొదటగా జనవరి 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన, అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు ఈ ఫెస్టివల్‌ను జనవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది మరింత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రాథమికంగా జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ప్రజలు, మీడియా మిత్రుల విజ్ఞప్తుల మేరకు జిల్లా కలెక్టర్ తో సంప్రదించి జనవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా గత సంవత్సరం 2025లో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగానిర్వహించబడిందన్నారు. ఈ ఏడాది కూడా పండుగల ముందే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనవరిలోనే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను మరింత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫెస్టివల్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో పాటు పలువురు మంత్రులకు అందజేయడం జరిగిందని, ముఖ్యమంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్‌కు హాజరవ్వడానికి అంగీకరించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి సూళ్ళూరుపేట నియోజకవర్గానికి రానుండటం గర్వకారణమన్నారు
ఈసారి ఫెస్టివల్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీ పాలెంతో పాటు కొత్తగా ఇరుకుం ఐలాండ్ , ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. దీంతో తిరుపతి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం కలుగుతుందన్నారు. ఫెస్టివల్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా పలు మార్లు సందర్శించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారన్నారు. ప్రజలు, అధికారులు, పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.సైబీరియా నుంచి వచ్చే ఫ్లెమింగోలు నేలపట్టు ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు నెలల పాటు నివసించడం ఒక అరుదైన ప్రకృతి అద్భుతమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతాల్లో పక్షుల ప్రదర్శన (Bird Exhibition) ఏర్పాటు చేసి, పక్షుల చిత్రాలు, పేర్లు, వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.కాబట్టి నియోజకవర్గ ప్రజలు తమ బంధుమిత్రులను ఆహ్వానించి, ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని, మీడియా మిత్రులు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.