Kadapa: బస్సుల షెడ్డులో అగ్ని ప్రమాదం

కడప శివారులోని ఆర్టీసీ జోనల్‌ వర్కుషాపు సమీపంలో ఉన్న ఆర్టీసీ స్క్రాప్‌ బస్సుల షెడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2020-03-18 03:05 GMT
Fire in the shed of RTC scrap buses

కడప: కడప శివారులోని ఆర్టీసీ జోనల్‌ వర్కుషాపు సమీపంలో ఉన్న ఆర్టీసీ స్క్రాప్‌ బస్సుల షెడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.12.50 లక్షలు ఆస్తినష్టం వాటిల్లింది. కడప అగ్నిమాపక అధికారి వివరాల మేరకు.. ఆర్టీసీ జోనల్‌ వర్కుషాపునకు సంబంధించిన స్క్రాప్‌ బస్సులను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటారు. ఈ మేరకు అబ్దుల్‌ అలీ అనే వ్యక్తి భారత్‌ రీరోలింగ్‌ మిల్లు పేరిట స్క్రాప్‌ బస్సుల భాగాలను తొలగించి వాటిని విక్రయిస్తాడు. కొన్నేళ్ల నుంచి జోనల్‌ వర్కుషాపు సమీపంలోనే తన షెడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో షెడ్డు సమీపంలో ఎండిన గడ్డి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.

దీనిని ఎవరూ గమనించకపోవడంతో మంటలు నెమ్మదిగా వ్యాపించడం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం కావడంతో గాలి తోడైంది. దీంతో ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. బస్సులకు సంబంధించిన విడిభాగాలు, టైర్లు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న మూడు స్క్రాప్‌ బస్సులకు కూడా మంటలు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికంగా ఉన్న వారు పొగలు, మంటలను చూసి భయాందోళన చెంది, ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు చుట్టూ పక్కల ప్రాంతాలను పొగ కమ్ముకుంది. అగ్నిమాపకశాఖకు ఫోన్‌ చేయడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు 13 నీటి ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు.

Tags:    

Similar News