వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు

Update: 2020-10-23 05:42 GMT

కళ్ల ముందు ఓ ప్రమాదం ఉందని గుర్తించలేకపోయారు. చీకట్లో ప్రయాణం ఇంటికి చేరుకోవాలనే ఆలోచనలో ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారు. చిన్న వంకే కదా.. దాటేద్దాం అనుకున్నారు. దాని లోతెంతో కూడా పట్టించుకోలేదు. ఎలాగోలా దాటాలని ప్రయత్నం చేశారు. కానీ వరద తాకిడి ముందు వారి అంచనా నిలవలేదు. కారుతో సహా కుటుంబమంతా కొట్టుకుపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

భారీ వర్షాలతో తెలుగురాష్ట్రాలు చిత్తడయ్యాయి. వాగులు వంకలు ప్రమాదకరంగా మారాయి. చిత్తూరు జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు పూతలపట్టు పెనుమూరు మండలాల మధ్య ఉన్న పెద్దవంక పొంగి పొర్లుతోంది. ఇక అదే సమయంలో పూతలపట్టు మండలం వడ్డారపల్లికి చెందిన ప్రతాప్ కటుంబం పెనుమూరులో ఓ పెళ్లికి హాజరై కారులో తిరిగివెళ్తున్నారు. మధ్యలో వరద పోటెత్తుతున్న పెద్దవంకను దాటే ప్రయత్నం చేశారు. మోకాళ్ల లోతు నీరు వెళ‌్తున్నా అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లారు. అంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో అధికారులు కనీసం సూచీలు పెట్టలేదు. దీంతో కారుతో సహా వరదలో కొట్టుకుపోయింది ఆ కుటుంబం.

అయితే ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రతాప్‌‌తో సహా తన కూతురు సాయివినీత గల్లంతయ్యారు‌. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు దంచికొడుతుండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొద్దిపాటి నిర్లక్ష్యం చూపినా ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇకనైనా వాహనదారులు ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

Full View


Tags:    

Similar News