Andhra Pradesh: ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ

Andhra Pradesh: పీఆర్సీకి వ్యతిరేకంగ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం

Update: 2022-01-20 06:29 GMT

ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ

Andhra Pradesh: ఏపీలో పీఆర్సీ మంటలు రేపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కలెక్టరేట్‌ల ముట్టడిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతల ముందస్తు అరెస్టులు జోరుగా జరుగుతున్నాయి .

శ్రీకాకుళంNGO జిల్లా అధ్యక్షుడు సాయిరాంను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనతోపాటు మరి కొంతమంది నాయకులను కూడా అరెస్ట్ చేసి 2టౌన్ పీఎస్‌కు తరలించారు. అటు నెల్లూరులో కలెక్టరేట్ నిర్బంధానికి బయలుదేరిన ఫ్యాప్టో నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల నిఘా కళ్ళు కప్పి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు ప్యాప్టో నిరసనకారులు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. నేడు ఉద్యోగసంఘాల నేతలు భేటీ అయి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇప్పటికే నిరసనలు హోరెత్తిస్తున్న ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో పిలుపు మేరకు నేడు కలెక్టరేట్లు ముట్టడించగా జాక్టో డివిజన్‌ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. సచివాలయ ఉగ్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేయనున్నారు. 

Tags:    

Similar News