Thirumala: తిరుమలలో త్రాగునీటికి కటకట!

Update: 2021-04-13 01:28 GMT

Thirumala:(File Image)

Thirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి నీటికి కటకట ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టిటిడి ప్లాస్టిక్‌ను నిషేధించి..ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను వాడేందుకు అనుమతించింది. కొండపై వివిధ ప్రాంతాల్లో జలప్రసాదాలను ఏర్పాటుచేసింది. పర్యావరణ రక్షణ ఉద్దేశం బాగానే ఉన్నా ప్రస్తుతం నీటి సీసాలు తగినంతగా లభించక భక్తులు అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా శీతల పానీయాలను కొనుక్కుంటున్నారు. 2 రోజులకోసారి నీటి సీసాలను సరఫరా చేస్తున్నారని, అవి అవసరాలను తీర్చడం లేదని దుకాణదారులే పేర్కొంటున్నారు. వచ్చే రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నందున ప్రజల దాహార్తిని తీర్చేందుకు తితిదే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని భక్తలు, స్థానికులు కోరుతున్నారు.

తిరుమలకు ప్రస్తుతం రోజూ 45వేల నుంచి 50 వేల మంది భక్తులు వస్తున్నారు. సాధారణంగా రోజుకు 3 వేల నుంచి 4 వేల కేసుల నీటి సీసాలు అవసరం. ఈ మేరకు గతంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు అందుబాటులో ఉండేవి. వాటి స్థానంలో తొలి రోజుల్లో గాజు సీసాల సరఫరా బాగానే ఉండేది. ఇప్పుడు వాటి సరఫరా తగినంత లేదు. కొవిడ్‌ నిబంధనల సడలింపు తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతున్నందున నీటి సమస్య మొదలైంది. అవసరమైన మేరకు నీటి సీసాల సరఫరాలో పంపిణీదారులు విఫలమయ్యారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి 500 కేసులు మాత్రమే తిరుమలకు వస్తున్నాయి.

తితిదే ఏర్పాటుచేసిన జలప్రసాదాల వద్ద అపరిశుభ్రత కనిపిస్తోంది. భక్తులకు సరైన అవగాహన లేక అక్కడే ఉమ్మడం, ఆహార వ్యర్థాలను నీటి కొళాయిల వద్దే పడేయడం వంటివి చేస్తున్నారు. మరోవైపు జనసమ్మర్థమున్న ప్రాంతాల్లోని జలప్రసాదాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. కొన్ని పెద్ద అతిథిగృహాల్లో వాటర్‌ డిస్పెన్సరీలు ఉన్నప్పటికీ.. ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ వంటి విడివిడిగా ఉన్న వసతిగృహాల్లో లేవు. వారు జలప్రసాదం వరకూ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైన తిరుమల తిరుపతి దేవస్థానం కళ్ళు తెరిచి భక్తులకు మంచి సౌకర్యాన్ని అవసరానికి అనుగుణంగా అందుబాటులో వుంచాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News