Three Capital Bill: ఆయన సూచనతోనే జగన్‌ వెనక్కి తగ్గారా?

Three Capital Bill: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం... మూడు రాజధానుల ఉపసంహరణ... ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Update: 2021-11-23 10:59 GMT

Three Capital Bill: ఆయన సూచనతోనే జగన్‌ వెనక్కి తగ్గారా?

Three Capital Bill: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం... మూడు రాజధానుల ఉపసంహరణ... ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఈ నిర్ణయం నిజమేనా? ఇంతకాలంగా రాజధాని రైతులు పోరాటం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోని జగన్ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి? మొదటి నుంచి మూడు రాజధానులు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం ఇప్పుడు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా? జగన్‌ నిర్ణయం వెనుక అమిత్‌షా ఉన్నారా? ఏపీలో జరుగుతున్న చర్చేంటి? ఆ రచ్చేంటి?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల ఇష్యూను తాత్కాలికంగా కోల్డ్‌ స్టోరేజీలో పెట్టారు. ఇప్పటికైతే మూడు కాదు ఒక్కటే రాజధాని అంటూ సెంటిమెంట్‌ మీద ఆయింట్‌మెంట్‌ పూశారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ, లెజిస్టేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి, జ్యుడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు అంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటికైతే రాజధాని అమరావతే అంటూ ఫైనల్‌ టచ్‌ ఇచ్చారు. ఎందుకు?

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజధాని అమరావతి గ్రామాలలో, గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2019 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన రాజధాని గ్రామాల ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. రాజధానిగా అమరావతి కొనసాగాలని తమ భూములను త్యాగం చేస్తే, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పడపై భగ్గుమన్నారు. అలా అమరావతి ప్రాంత రైతులంతా కలసి రాజధాని అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకోవాలని, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నాటి నుంచి నేటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

రాజధాని రైతుల గోడు వినని జగన్ సర్కారు మూడు రాజధానులు ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించడం, ఆ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేయడం చకచకా జరిగిపోయింది. ఇదే సమయంలో సీఆర్‌డీఏను కూడా రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం చంద్రబాబుపై కోపంతో ఇలా నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదంటూ రాజధాని ప్రాంత రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎన్నోసార్లు కోరారు. అయినప్పటికీ రాజధాని ప్రాంత రైతుల గోడు విన్న దాఖలాలు లేవు. ఈ ఇష్యూపై కోర్టులకు వెళ్లినా సరే వెనక్కి తగ్గని జగన్ మూడు రాజధానుల వైపే మొగ్గు చూపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ వడివడిగా అడుగులు వేశారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని, రాజధాని రైతుల పోరాటం, పెయిడ్ ఆర్టిస్టుల పోరాటమని, కేవలం తెలుగుదేశం పార్టీ బినామీల కోసం జరుగుతున్న ఉద్యమంటూ వైసీపీ నాయకులు పదేపదే విమర్శించారు. ఇక అప్పటి నుంచి మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్‌ మార్చుకోరని డిసైడ్‌ అయినా రాజధాని రైతులు తమ పోరాటం ఆపలేదు. మూడు రాజధానుల నిర్ణయంతో అక్కడ భూముల ధరలు ఒక్కసారిగా పాతాళానికి చేరిపోయాయి. రాజధాని నగరంలో కట్టిన బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల ధర పతనానికి చేరుకుంది. రాజధాని నగరంగా ఉన్న అమరావతి ప్రాంతం వెలవెలబోయింది. అక్కడ వ్యాపారాలు కుప్ప కూలాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మూడు రాజధానుల నిర్ణయం దెబ్బకు ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అమరావతే రాజధాని అన్న మాటను అక్కడి రైతులు దాదాపు మరిచిపోతున్న సమయంలో సీఎం జగన్‌ ఒక్కసారిగా సడన్‌ షాక్‌ ఇచ్చారు. హైకోర్టులో రాజధాని కేసుల విచారణ జరుగుతున్న వేళ మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం ఆలోచించేలా చేస్తోంది. ఇంతకాలం నుంచి ఎంత పోరాటం చేసినా స్పందించని జగన్, ఉన్నపళంగా రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతుంది. దీని వెనుక కచ్చితంగా కేంద్రం హస్తం ఉండి ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. మొన్నీ మధ్య ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్‌ కలిశారు. అక్కడే దీనిపై నిర్ణయం తీసుకొని ఉంటారని టాక్‌ వినిపిస్తోంది. అమిత్‌షా తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్లిన తర్వాతే మోడీ సర్కార్‌ రైతుల చట్టాలను రద్దు చేసింది. దీనిపై కూడా జగన్‌తో అమిత్‌షా చర్చించి ఉంటారని, రైతులతో పెట్టుకునే బదులు కర్ర విరగకుండా, పాము చావకుండా నిర్ణయాలు తీసుకుంటే మేలన్న అండర్‌స్టాండింగ్‌ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అమిత్‌షా డైరెక్షన్‌లోనే జగన్‌ మూడు రాజధానుల ఉపసంహరణపై అడుగు వేసినట్టు చర్చ జరుగుతోంది.

ఇక్కడే ఇంకో మాట కూడా వినిపిస్తోంది. రాజధాని అమరావతి పట్ల పాజిటివ్‌గా ఆలోచించేదైతే సీఎం జగన్ ఎప్పుడో స్పందించేవాడని, ఇంత కాలం తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంలో ఏదో మెలిక ఉందని రాజధాని గ్రామాలలో ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటే బాగుంటుందని కూడా వారు భావిస్తున్నారు. ఒకవేళ ఇది కేవలం కోర్టు కేసుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమైతే, జగన్ స్టెప్‌ ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది. ఏమైనా ఊహించని విధంగా ఇచ్చిన షాక్‌తో రాజధాని ప్రాంత ప్రజలు కోలుకోలేకపోతున్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు. మరి, ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News