Kurnool: వెంకటేశ్వర స్వామికి తేళ్లను మాలగా సమర్పిస్తోన్న భక్తులు

* ఏటా శ్రావణ మాసం మూడో వారం తేళ్ల పండగ * తేళ్లు సమర్పిస్తే మొక్కులు తీరతాయని భక్తుల నమ్మకం

Update: 2021-08-24 05:30 GMT

కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్ల పండుగ(ఫోటో: ది హన్స్ ఇండియా)

Kurnool District: ఎవరికైనా తేలు కనిపిస్తే హడలిపోతారు. దాన్ని చంపే వరకు వదలరు. కానీ వీరు మాత్రం తేలు కనిపిస్తే ఆనందం వ్యక్తం చేస్తారు. తమ అదృష్టం పండించే దేవుడుగా భావిస్తారు, పూజిస్తారు. కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంత ప్రజల నమ్మకం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. కోడుమూరు కొండపై కొండ్రాయుడు ఆలయం ఉంది. ఇది వెంకటేశ్వరస్వామి కోవెలగా భక్తులు భావిస్తారు. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే ఇక్కడ సందడే. శ్రావణమాసం మూడవ సోమవారం ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

వెంకటేశ్వరస్వామి మహిమ వల్లే ఇక్కడ తేలు కూడా దేవుడుగా మారిపోయిందంటారు భక్తులు. ఈ కొండపై ఏ రాయిని కదిలించిన జరజరమంటూ తెళ్ళు బయటకు వస్తాయి. శ్రావణమాసం మూడవ సోమవారం ఈ కొండపై దేవుడు దర్శనం కోసం వచ్చే భక్తులు ముందు తేళ్ల వేట మొదలు పెడతారు. తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామి వారికి హారంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.

తేళ్ల మాలను స్వామికి సమర్పిస్తే తమకు మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అయితే స్వామి మహిమ వల్ల తేళ్లు తమను కుట్టవంటారు భక్తులు. ఒక వేళ కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి పోతుందని చెప్తున్నారు. ఇక ఈ తేళ్లతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తారు భక్తులు. తేళ్లను శరీరంపై వేసుకొని వీరు చేసే విన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయినా తేళ్లు తమను ఏమి చేయవని భక్తులు అంటున్నారు.

Tags:    

Similar News