TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి తప్పని తిప్పలు

* కరోనా ఆంక్షలతో సామాన్యుడికి దూరమవుతున్న దర్శనం * టికెట్‌ ఉన్నవారికి మాత్రమే కొండపైకి అనుమతి

Update: 2021-11-11 03:35 GMT

టీటీడీ (ఫోటో- ది హన్స్ ఇండియా)

TTD: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుడికి ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులు ఉన్నారు‌. మొక్కులు చెల్లించుకునేవారు, కోర్కెలు కోరుకునేవారు, పుట్టెంటుకలు తీయించేవారు, పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా జీవితంలో ఏ శుభకార్యమైనా సరే ఏడాదికి ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా నిత్యం కళకళలాడే గోవిందుని సన్నిధి మహమ్మారి కరోనాతో ఒక్కసారిగా వెలవెలబోయింది.

కరోనా ఆంక్షల నేపథ్యంలో స్వామి దర్శనం సామాన్యుడికి దూరమైంది. ఎప్పుడంటే అప్పుడు బయలుదేరి వెళ్లి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకునే భక్తులకు తిరుమల కొండ ఎక్కడానికే అనుమతి లేకుండాపోయింది.

కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించినా స్వామి దర్శనానికి తిప్పలు తప్పడం లేదు. టికెట్టు ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. దీంతో భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు అక్రమాలకు తెర తీస్తున్నారు. దర్శనం టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో విడుదలయ్యే టికెట్లను పొందలేని యాత్రికులు దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో నకిలీ టికెట్లు, సిఫార్సులతో భక్తులను మోసగించిన ఘటనలు అధికమయ్యాయి. దీంతో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News