Cyclone Montha: 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడనున్న మొంథా
Cyclone Montha: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఏపీని వణికించిన మొంథా తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది.
Cyclone Montha: 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడనున్న మొంథా
Cyclone Montha: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఏపీని వణికించిన మొంథా తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు IMD ప్రకటించింది. అర్థరాత్రి 11.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల మధ్యలో మొంథా తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలింది. మొంథా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనుంది. తుపాను ప్రభావంతో గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్‌తో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాన్ నేపథ్యంలో ఏపీలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది.
మొంథా తీవ్ర తుఫాన్ ధాటికి ఏపీలోని విశాఖ నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాలను తుఫాన్ వణికిస్తున్నది. కోనసీమ జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలుతున్నాయి. కాకినాడ, యానం తీరప్రాంతాల్లో ఉప్పెన వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నది. మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్లు, విశాఖకు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.