రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవాలు.. ఆర్ట్స్‌ కాలేజీలో ఇవాళ, రేపు...

Rajahmundry: *జాన‌ప‌ద‌, గిరిజ‌న క‌ళ‌లు, నృత్యం, సంగీతం, వంటకాల ప్రదర్శన *పాల్గొననున్న వేలాది మంది కళాకారులు

Update: 2022-03-26 07:15 GMT

రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవాలు.. ఆర్ట్స్‌ కాలేజీలో ఇవాళ, రేపు...

Rajahmundry: చారిత్రక నగరం రాజ‌మ‌ండ్రి కళా మహోత్సవానికి సిద్ధమైంది. నేటి నుంచి రెండ్రోజుల పాటు కన్నుల పండువగా ఈ వేడుకలు జరగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 12వ జాతీయ సంస్కృతి మహోత్సవాలను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సినీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.

రాజ‌మ‌ండ్రి ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో జాతీయ సాంస్కృతిక కళా మహోత్సవాలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. దేశ మహోన్నత సంస్కృతి, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా జరగనున్న ఈ వేడుకల్లో తేట తెలుగు సంస్కృతి, కళల కనువిందు, పలు రకాల ప్రసిద్ధ వంటకాల ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి వైభవం, విశిష్టతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఏక్ భార‌త్ - శ్రేష్ట భార‌త్ ల‌క్ష్యాలు, క‌ల‌లను సాకారం చేసే క్రమంలో జాన‌ప‌ద‌, గిరిజ‌న క‌ళ‌లు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు అలరించనున్నారు.

భార‌త‌దేశ సంస్కృతి, విశిష్టత, వార‌స‌త్వ సంప‌ద పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ జాతీయ సంస్కృతీ మహోత్సవాలను నిర్వహిస్తోంది. భావి భారత పౌరులైన యువ‌త‌కు దేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలిపేందుకు..దేశంలోని ఏడు జోన‌ల్ సాంస్కృతిక కేంద్రాల క్రియాశీల భాగ‌స్వామ్యంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ వేడుక‌ల‌ను ఏటా నిర్వహిస్తోంది. అయితే.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు తొలిసారి జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టిసారిగా జ‌రుగుతోన్న ఈ ఉత్సవాల్లో దాదాపు వెయ్యి మంది క‌ళాకారులు, పాక‌శాస్త్ర నిపుణులు త‌మ నైపుణ్యాలను ప్రదర్వించనున్నారు.

Tags:    

Similar News