Andhra Pradesh: ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న డ్రగ్స్‌ ఏపిసోడ్

* అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శనాస్త్రాలు * విజయవాడలో డ్రగ్స్‌ మూలాలు ఉన్నాయన్న డీఆర్ఐ

Update: 2021-09-23 10:00 GMT

 హెరాయిన్ (ఫొటో- ది హన్స్ ఇండియా ) 

Andhra Pradesh: ఏపీలో హెరాయిన్ ఎపిసోడ్ రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు తావిస్తోంది. ఇదంతా వైసీపీ కనుసన్నల్లోనే జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తుండగా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది అధికార పార్టీ. ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ డ్రగ్స్‌ కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని సీపీ స్పష్టం చేశారు. అయినప్పటికీ టీడీపీ విమర్శల పర్వం మాత్రం ఆగడం లేదు.

హెరాయిన్ వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రాల్చింది. విజయవాడలో డ్రగ్స్‌ మూలాలు ఉన్నాయని డీఆర్ఐ అంటుంటే పోలీసులు లేవు అనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పూర్తి విచారణ చేసి‌‌‌ అసలు విషయం బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాల నుంచి హెరాయిన్ వంటి డ్రగ్స్‌ వరకు ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ గౌరవ ప్రతిష్టలను టీడీపీ నేతలు మంటగలుపుతున్నారని ఫైర్‌ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఆంధ్రా తాలిబన్లుగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో పాపాలు, దుర్మార్గాలు జరుగుతున్నట్టు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సబంధం లేదని సీపీ స్పష్టం చేసినా అవి పట్టించుకోకుండా ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు పేర్ని నాని.

ఇప్పుడు ఈ డ్రగ్స్ తంతు విద్యార్థులకు చుట్టుకుంది. విజయవాడలో ఎన్నో విద్యాలయాలు ఉన్నాయని, మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా విజయవాడ మారకుండా చూడాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో కూడా హాస్టల్‌ రూమ్‌లలో గంజాయి దొరికిన ఘటనలు వెలుగు చూశాయని, ఇప్పుడు హెరాయిన్‌ మూలాలు కలకలం రేపుతోందన్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు.

Tags:    

Similar News