Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ విజృంభణ

Andhra Pradesh: గిరిజన గ్రామాలను వదలని కరోనా వైరస్ * నందిగామలో కరోనా విజేతగా నిలిచిన 90 ఏళ్ల బామ్మ

Update: 2021-06-02 11:32 GMT

Representational Image

Andhra Pradesh: కరోనా మహమ్మారిని తరిమికొట్టిన ఓ 90 ఏళ్ల బామ్మ కథ ఇది. ఆమె నివసించే ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలు లేవు. కార్పొరేట్ ఆస్పత్రులు అస్సలు కానరావు. అయితేనేం కొండంత మనోనిబ్బరాన్నే ఆయుధంగా చేసుకుని కరోనాతో పోరాడింది. ధైర్యమే కరోనాకు మందు అని ఘంటాపదంగా చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతానికి చెందిన పులుసు రాములమ్మ 9 పదుల వయస్సులోనూ కరోనాకు జయించి విజేతగా నిలిచింది

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కాకులు దూరని కారడవుల్లోకి సైతం ప్రవేశించింది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే గిరిజన గ్రామాలనూ వణికిస్తోంది. ఏటపాక మండలం నందిగామకు చెందిన పులుసు రాములమ్మ ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటుంది. 17 మంది నివాసం ఉంటోన్న ఆ ఇంట్లోకి కరోనా ప్రవేశించింది. రాములమ్మ కొడుకు వెంకటేశ్వరరావు, కోడలు మహాలక్ష్మీ, పిల్లలు గౌతమ్, సుజాత, శ్రీకృష్ణ, సత్యనారాయణలకు వైరస్ సోకింది. వీరందరికి కరోనా సోకడం ఒక ఎత్తైతే.. 90 ఏళ్లకు చేరువలో ఉన్న రాములమ్మకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఒకింత ఆ కుటుంబమంతా కలవారినికి గురయ్యింది. వయసు మీదపడి చిగురుటాకులా వణుకుతున్న రాములమ్మను చూసి కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. కాని కొద్ది రోజుల్లోనే రాములమ్మ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

పట్టణాలు, నగరాల్లో ప్రజలు కరోనా పేరు చెబితే వణికిపోతున్న ఈ రోజుల్లో మారుమూల పల్లె.. అదీ ఏజెన్సీలోని గిరిజన గ్రామంలో కరోనాను జయించిన రాములమ్మను పలువురు ఆదర్శంగా తీసుకుంటున్నారు. కరోనాను ఎలా జయించావు అని ప్రశ్నించగానే తనలో ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని ధైర్యం అన్న ఒక్కమాట మాత్రం గట్టిగా చెబుతుంది. కరోనా అంటేనే భయంతో వణికిపోతున్న వారికి ఈ బామ్మ ఒక పెద్ద సవాల్‌నే విసిరింది. ఈ బామ్మను చూసైనా కరోనాకు భయపడే జనం ధైర్యంగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉంది. 

Tags:    

Similar News