కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

Update: 2025-12-17 09:02 GMT

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

‘‘ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పని చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకం. కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలి. అలాగే వారి సేవలను కూడా వినియోగించుకోవాలి. వివిధ జిల్లాల్లో అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచాలని సీఎం ఆదేశించారు. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదామన్నారు. చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు తెలియచేసేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News