సీఎం హోదాలో తొలిసారి కడపకు జగన్... సోమవారం పర్యటన

Update: 2019-07-07 12:08 GMT

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక సొంత ఇలాఖ కడపలో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. జగన్‌. తండ్రి వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం జరపాలని నిర్ణయించిన జగన్‌.. అదే రోజు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రైతులకు, కడప ప్రజలకు జగన్‌ భరోసా ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌ తొలిసారిగా కడపలో అడుగు పెట్టబోతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకర్గాల్లో జగన్‌ పర్యటిస్తుండటంతో.. అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం 8 గంటలా 10 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్‌ అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ జయంతి సందర్భంగా.. ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 9 గంటలా 35 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి రోడ్డుమార్గాన గండి నియోజకవర్గానికి చేరుకుంటారు. గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పులివెందులలో డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్‌ స్టేషన్‌‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత జగన్‌ ఇడుపులపాయకు.. అక్కడి నుంచి జమ్మలమడుగుకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలా 15 నిమిషాలకు జమ్మలమడుగులో జరిగే రైతు దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ పింఛన్‌ పథకాన్ని ప్రారంభిస్తారు. వృద్ధులు, వికలాంగులకు తన చేతుల మీదుగా 2 వేల 250 రూపాయల పింఛన్లకు సంబంధించిన చెక్కులను అందజేస్తారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమంపై జగన్‌ కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు క్వింటాల్‌ శనగలకు 6 వేల 500 రూపాయలతో మద్దతు ధర ప్రకటిస్తారు. జగన్‌ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 వేలమంది కూర్చునేందుకు వీలుగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన వేదికను 75 మంది కూర్చునేలా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News