ఏలూరు వింత వ్యాధి కేసుల్లో వీడిన మిస్టరీ

Update: 2020-12-16 12:44 GMT

ఏలూరు వింత వ్యాధి కేసుల్లో మిస్టరీ వీడింది. అంతుచిక్కని వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్‌ తేల్చింది. అయితే, పురుగుమందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయనే దానిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు తెలియజేశారు.

పురుగుమందుల అవశేషాలే ఏలూరులో వింత వ్యాధికి కారణమని ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక ఇవ్వడంతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పురుగుమందుల అవశేషాలు అసలు మనుషుల శరీరాల్లోకి ఎలా వచ్చాయో తేల్చేందుకు ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు జరపాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు పరీక్షల బాధ్యతలను ఢిల్లీ ఎయిమ్స్‌, అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి అప్పగించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌ బృందం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ నిపుణులతోపాటు కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్ధల ఎక్స్‌పర్ట్స్ పాల్గొన్నారు. ‎ఏలూరులో రోగుల వింత ప్రవర్తనకు పురుగుమందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దాంతో, క్రమం తప్పకుండా ఆహారం, నీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని సీఎం జగన్ సూచించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేసేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

Tags:    

Similar News