CM Jagan: ఇవాళ ఒంగోలు పర్యటనకు సీఎం జగన్‌

CM Jagan: ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం

Update: 2022-04-22 00:45 GMT

CM Jagan: ఇవాళ ఒంగోలు పర్యటనకు సీఎం జగన్‌

CM Jagan: అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఒంగోలు నగరం ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమైనది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 12వందల కోట్ల రూపాయల వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒంగోలు వేదికగా మీట నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని ఏబీఎం కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభా వేదిక, డ్వాక్రా మహిళల స్టాల్స్ ను PVR బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళల తరలింపు కోసం 250 బస్సులను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతో పాటు 57 మంది వైద్య సిబ్బందితో ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలిక గార్గ్ ఎప్పటికప్పుడు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరమంతా సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత రాత్రి వినుకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం తీసుకున్న విషయంలో ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నానని ఆయన చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారని, సంబధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది సున్నా వడ్డీ నగదు అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా 1,261 కోట్ల వడ్డీ వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. స్వయం ఉపాధి కోసం మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే ఏటా వడ్డీని చెల్లిస్తోంది. అది కూడా నేరుగా డ్వాక్రా సంఘాల మహిళల అకౌంట్లలో జమచేస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం 9.76 లక్షల సంఘాల్లోని కోటి మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.

ఇప్పటి వరకూ మూడు విడుతలగా 3,615 కోట్ల నిధులను అక్కచెల్లెమ్మలకు వడ్డీ కింద జమ చేశారు. ఈ పథకం ద్వారా తీసుకున్న అప్పులను వెంటనే చెల్లిస్తుండటంతో బ్యాంకులు కూడా తిరిగి రుణాలు ఇచ్చేందుకు సహకరిస్తున్నారు. గతంలో నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ ఎసెట్స్‌ కింద కోట్లాది రూపాయలు బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వంలో మహిళలు వచ్చిన తర్వాత 99 శాతానికిపైగా రుణాల చెల్లింపులు జరుగుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలో 8.71 లక్షల గ్రూపులు ఉంటే ప్రస్తుతం అవి 9.76 లక్షలకు చేరాయి.

Full View


Tags:    

Similar News