CM Jagan: 26 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు

CM Jagan:పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాల్ని తీరుస్తున్నాం * వెనుకబడిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం

Update: 2021-08-15 07:07 GMT

సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. 26 నెలల పాలనలోఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన తెలిపారు. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాల్ని తీరుస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నామని సీఎం జగన్ అన్నారు.

వ్యవసాయ రంగంపై 83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం జగన్ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఏటా 13 వేల 500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటి వరకు 17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం 33 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చినట్టు సీఎం జగన్ తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన గడప వద్దకే పింఛన్ అందిస్తున్నామన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్‌బీకేల ద్వారా సేవల అందిస్తున్నామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద వెయ్యి 39 కోట్లు చెల్లించామన్నారు. ఏపీ అమూల్ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని సీఎం స్పష్టం చేశారు..

నాడు- నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని సీఎం జగన్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టికాహారం అందిస్తామన్నారు. తమ ప్రభుత్ం మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. అక్కా చెల్లెమ్మల పేరిట 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని సీఎం ఇచ్చారు.

అమ్మఒడి ద్వారా రెండేళ్లలో 13వేల కోట్లు ఇచ్చామన్నారు. వైఎస్సాఆర్ చేయూత ద్వారా 9వేల కోట్లు ఇచ్చామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు 6 వేల 500 కోట్లు అందించామన్నారు. మహిళల భద్రతకు దిశాచట్టం, దిశా పోలీస్ స్టేషన్‌లు, దిశా యాప్‌లు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. 

Tags:    

Similar News