ఇదే మా బలం: సీఎం జగన్‌‌

Update: 2019-08-09 15:59 GMT

975 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం నాలుగు ఓడ రేవులు ఆరు విమానాశ్రయాలు ఇవే ఆంధ్ర్రప్రదేశ్‌ బలమంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన సదస్సులో కీలకోపన్యాసం చేసిన వైఎస్ జగన్‌‌ ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయంటూ వివరించారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయన్న సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ఇన్వెస్టర్లలో నమ్మకం, ధైర్యం కల్పించేందుకు అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

మా బలహీనతలేంటో మీకు తెలుసు కానీ మా బలమేంటో మీకు చెబుతానంటూ అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలాంటి మెట్రో నగరాలు ఏపీకి లేవు, కానీ సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు ఆంధ్రప్రదేశ్‌ సొంతమంటూ ఫారిన్ ఇన్వెస్టర్లకు వైఎస్‌ జగన్‌ వివరించారు.

సుస్థిర ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఉంటేనే, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయన్న సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ఇన్వెస్టర్ట విశ్వాసం పొందడానికి అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలు తమకు అఖండ విజయం కట్టబెట్టారన్న జగన్‌ అటు కేంద్రం సహకారం, ఇటు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్న వైఎస్ జగన్‌ ఇన్వెస్టర్లలో నమ్మకం, ధైర్యం కల్పించేందుకు అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే, పోర్టులు, ఎయిర్‌‌పోర్టులు, విశాఖ, విజయవాడ, గుంటూరు మెట్రోరైల్‌ ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, రవాణా, ఆక్వా, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడుదారుల సహకారం కావాలని సీఎం జగన్మోహన్‌‌రెడ్డి కోరారు.

Tags:    

Similar News