10 అంశాలపై సుదీర్ఘంగా వివరించిన సీఎం జగన్‌

Update: 2019-10-06 06:44 GMT

నవరత్నాలకు చేయూతనివ్వడంతో పాటు రెవెన్యూలోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని నిధులు విడుదల చేసి ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. సుమారు గంటన్నర పాటు మోడీతో భేటీ అయిన జగన్‌ రాష్ట్ర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోడీని జగన్‌ ఆహ్వానించారు.

ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహకారం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోడీని కలిపి విజ్ఞప్తి చేశారు. శనివారం మోడీతో భేటీ అయిన జగన్‌ ముఖ్యంగా 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 15 న నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి 61 వేల 71 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు కేవలం 6 వేల 739 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని గుర్తు చేశారు. సకాలంలో నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్ ప్రధానిని కోరారు.

ఇక రెవెన్యూలోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన 18 వేల 969 కోట్లను వెంటనే విడుదల చేయాలని సవరించిన లెక్కల ప్రకారం అదనపు నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అలాగే పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 5 వేల 103 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రాజెక్టు పనుల కోసం మరో 16 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 838 కోట్లు ఆదా చేసినట్లు వివరించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్ల చొప్పున ఆరేళ్లలో 2 వేల 100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ వెయ్యీ 50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మిగతా నిధులను వెంటనే ఇవ్వాలని కోరారు. అలాగే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం కోసం సహకరించాలని పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టుల నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన హామీలైన నవరత్నాలుకు చేయూతనివ్వాలని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే సహజంగా పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలవైపు చూస్తారని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News