CM Jagan: సాయంత్రం మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం
CM Jagan: ప్రధానితో భేటీ తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
CM Jagan: సాయంత్రం మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నా, కీలక బిల్లులకు వైసీపీ సపోర్టు కావాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని సీఎం జగన్ ప్రధాని మోడీతో పాటు అమిత్ షాను కోరనున్నారన్న చర్చ నడుస్తోంది.
అయితే ప్రత్యేక హోదా కాకుండా ఏపీకి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోలవరానికి 12 వేల కోట్లతో పాటు రాష్ట్రాభివృద్ధికి 10 వేల కోట్ల ఇస్తున్నట్లు గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రటించింది. ఇప్పుడు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కింద మరో 22 వేల కోట్లను ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కోణంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి... జగన్ ఒప్పించి.. తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో కేంద్రం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీని కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారా..? లేక యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి కీలక బిల్లులకు మద్దతు ఇచ్చేలా ఒప్పిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీకి ఏం చేయలేదన్న అపఖ్యాతి మూటగట్టుకునే కంటే... నిధులు ఇచ్చి ప్రజల మద్దతును కూడకట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలని చేశారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేయడం ద్వారా ఎన్టీఆర్ లెగసీని అందిపుచ్చుకోవడంతో పాటు టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులను బీజేపీ అనుకూలంగా మర్చుకునేలా చేయవచ్చన్న యోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
విభజన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి... ప్రజల మద్దతు కూడగట్టేలా కేంద్రం ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సమీప భవిష్యత్తులో ఏపీలో ఏ పార్టీతో పొత్తులు లేకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న ఆలోచనలో బీజేపీ అధినాకత్వం ఉన్నట్లు బీజేపీ చర్చ జరుగుతోంది.