ఆమంచి పార్టీ మార్పు!

Update: 2019-02-06 04:13 GMT

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి . మంగళవారం పందిళ్లపల్లిలోని ఆయన స్వగ్రామంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. వారంతా వైసీపీలోకి వెళ్లాలని ఆమంచికి సూచించినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమంచి.. టీడీపీ మహిళా నేత పోతుల సునీతకు పార్టీలో ప్రాధాన్యం పెంచడంతో తనను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.అలాగే ప్రభుత్వంలో ఒక సామాజికవర్గం వారికి ప్రాధాన్యం పెరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలతో ఆమంచి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా ఆమంచితో మాట్లాడారు. ఒక సందర్భంలో ఆయన పవన్‌ కల్యాణ్‌ను కలవడం కూడా జరిగింది. ఆమంచికి దూరపు బంధువైన మాజీ మంత్రి బొత్స ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో చేరాల్సిందిగా మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరావు ఆమంచికి సూచిస్తున్నారు. మరోవైపు ఆమంచి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో మంత్రి శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఆయన వద్దకు పంపించింది. అలాగే మంత్రి లోకేష్ ఆయనతో మాట్లాడారని.. బుధవారం సీఎంను కలవాల్సిందిగా ఆమంచిని లోకేష్ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. 

Similar News