సీఎం జగన్ అసమర్థత వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గాయి : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు. జగన్ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయని ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు. జగన్ అసమర్థత వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గాయని ఆరోపించారు. బీసీలకు 33ఏళ్లగా ఉన్న రిజర్వేషన్లు కాపాడలేకపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం బీసీలపై కక్షతోనే ఇలా చేస్తుందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సమర్థమైన నేతలు క్షేత్రస్థాయిలో రావాలనే బీసీలకు 27 శాతం 1987లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. అలాగే 1995లో 34 శాతం రిజర్వేషన్ కేటాయించామని చంద్రబాబు గుర్తు చేశారు.
50 శాతం రిజర్వేషన్లతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలకు 24 శాతం మాత్రమే వస్తాయని తెలిపారు. 1987లో రిజర్వేషన్ల కంటే మూడు శాతం తగ్గుతాయని వెల్లడించారు. అమరావతిని నాశనం చేసేందుకు న్యాయవాది ముకుల్ రోహత్గీని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారని, ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కేసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. మండలి రద్దు కోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేశారు. కానీ, బీసీ రిజర్వేషన్లు కాపాడటంపై ఎందుకు అశ్రద్ధ చూపెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆదరణ పథకంలో పంపిణీ చేయాల్సిన పనిముట్లను గోదాముల్లో ఉంచారని విమర్శించారు. బీసీ నేతలకు ప్రధాన్యం ఉండే శాసన మండలిని రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాపరెడ్డి , బీసీ రామాంజనేయులు వైసీపీ వాళ్లు కాదా అని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ సబ్‌ప్లాన్ తీసుకొచ్చి నిధులు కేటాయించామని చంద్రబాబు అన్నారు.