కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు లాభదాయం కాదు : కేంద్ర మంత్రి

Update: 2019-11-20 03:38 GMT

కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు సహా విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై లోక్‌సభలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కేశినేని ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంటు,

దుగరాజట్నం పోర్టు లాభదాయం కాదని చెప్పారు. అంతేకాదు నియోజకవర్గాల పెంపు కూడా 2026 ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రెవెన్యూ లోటు కింద 2015-20 రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే.. ఇప్పటి వరకు రూ.19,613 కోట్లు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఏపీకి వచ్చారు. ఈ సందర్బంగా కడప స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు చేప్పారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైతే కావలసిన ముడిపదార్దం ఐరన్ ఓర్ ను కేంద్ర రంగ సంస్థ ఎన్ఎండిసి నుంచి ఇచ్చేందుకు ధర్మేంద్ర ప్రదాన్ అంగీకారం తెలిపారు.

మరోవైపు 2016 నుంచే కడపలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చెయ్యాలని ఏపీ ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ కుదరదని చెబుతోంది. దాంతో గతేడాది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో జగన్ సీఎం అవడంతో మళ్ళీ ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది జనవరిలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అయితే ప్లాంటు ఏర్పాటు పూర్తయ్యాక కావలసిన ముడిపదార్దం ఐరన్ ఓర్ ను సరఫరా చేస్తామని వెల్లడించింది కేంద్రం. 

Tags:    

Similar News