AP Budget 2025: నేడు ఏపీ బడ్జెట్.. ఆ స్కీములకు భారీగా కేటాయింపులు
AP Budget 2025: ఏపీ సర్కార్ ఫుల్ టెన్షన్ లోఉన్నట్లు అనిపిస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవ్వడంతో..ప్రజలు సూపర్ సిక్స్ హామీల సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ హామీల అమలే లక్ష్యంగా నేడు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. దాని కంటే ముందు ఉదయం 9గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. తర్వాత ఉదయం 11గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్..బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ. 3.20 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా సూపర్ సిక్స్ స్కీముల అమలు కీలకం కాబోతోంది. ఏప్రిల్ నుంచి అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు ప్రయాణం, మే నుంచి తల్లికి వందనం వంటి స్కీముల అమలు కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ అమలు చేయాలంటే వెంటనే రూ. 20వేల కోట్లు అవసరం ఉంటుందని అంచనా. వీటిని ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి బడ్జెట్ లో ఈ పథకాలకు కేటాయింపులు కీలకం కాబోతున్నాయి.
ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయని సమాచారం. దాదాపు 50వేల కోట్ల రూపాయలను వ్యవసాయానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి గత 2 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తో కలిసి చాలా మంతనాలు సాగించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో నేడు తెలుస్తుంది.
అన్నింటికంటే ముఖ్యమైంది రాజధాని అమరావతి నిర్మాణం. దీనికి కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నా ప్రపంచబ్యాంక్ నుంచి రూ. 15వేల కోట్ల అప్పు వస్తున్నా రాజధాని నిర్మాణానికి ఎలాంటి ప్లాన్ అమలు చేస్తున్నారన్నది ముఖ్యం. 2014లో లాగా భారీ ప్లాన్ కాకుండా ఏడాదికాలంలో పూర్తి చేయడానికి వీలైన నిర్మాణాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని రూపురేఖలు వస్తే అప్పుడు పెట్టుబడులు కూడా తరలివచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక ఉగాది నుంచి ప్రారంభించే పీ4 కార్యక్రమాన్ని ఎలా అమలు చేస్తారో కూడా బడ్జెట్లో వివరిస్తారని తెలుస్తోంది. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ లో భాగంగా 20 సంపన్న ఫ్యామిలీలు, 15 పేదలకు సాయం చేసేలా ఓ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి కొన్ని అదనపు కార్యక్రమాలను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని సమాచారం.