జనవరి నెల వరకు పర్వదినాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
టీటీడీ ఈ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసింది.
తిరుమల; టీటీడీ ఈ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసింది. ఈ నెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన 29వ తేదీ, 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించం అని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.
30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
ఆంగ్ల నూతన సంవత్సరాది 2026 జనవరి 1న వేకువజామున 1 గంట నుండి 4 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 4 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.