యాక్సిడెంట్ స్పాట్ నుంచి ముందుకొచ్చిన బోటు

Update: 2019-10-16 12:27 GMT

రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి నెలరోజులు దాటిపోతున్నా, ఇంకా 13మంది ఆచూకీ దొరకకపోవడంతో బోటును ఏదోవిధంగా బయటికి తీసేందుకు ఆపరేషన్ చేపడుతూనే ఉన్నారు. అయితే, బోట్ల వెలికితీతలో నైపుణ్యమున్న ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైనా అధికారులు మరోసారి అవకాశమివ్వడంతో బోటును బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

మూడ్రోజులుగా కచ్చులూరులో ఆపరేషన్ చేపడుతోన్న ధర్మాడి సత్యం బృందం ఇవాళ పురోగతి సాధించింది. ధర్మాడి సత్యం టీమ్‌ వేసిన లంగరుకు బోటు చిక్కింది. అయితే, లంగరును లాగుతుండగా బోటు ముందుకు కదిలినా, అంతలోనే లంగరు పట్టువదిలేసింది. లంగరుతో లాగడం వల్ల యాక్సిడెంట్ స్పాట్ నుంచి బోటు ముందుకు జరిగిందని ధర్మాడి సత్యం తెలిపారు.

అయితే, నేరుగా లంగరు వేయగలిగితేనే బోటు బయటికి తీయగలగమని ధర్మాడి సత్యం అంటున్నారు. నదీగర్భంలోకి వెళ్లి నేరుగా బోటుకు లంగరు వేసేందుకు విశాఖ నుంచి గత ఈతగాళ్లను రప్పిస్తున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లతో నేరుగా బోటుకు లంగరు వేయగలిగితే విజయం సాధించినట్లేనని, ఒకవేళ అది సాధ్యంకాకపోతే ప్రొక్లైన్‌ తో ఆపరేషన్ చేపడతామని ధర్మాడి సత్యం అంటున్నారు.  

Tags:    

Similar News