Vijayawada: భవానీ దీక్షల విరమణలు ప్రారంభం.. సిద్ధమైన ఇంద్రకీలాద్రి

Vijayawada: ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ

Update: 2022-12-15 04:59 GMT

Vijayawada: భవానీ దీక్షల విరమణలు ప్రారంభం.. సిద్ధమైన ఇంద్రకీలాద్రి

Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ముస్తాబైంది. ఇవాళ ప్రారంభమయ్యే దీక్షల విరమణ ఐదు రోజుల పాటు సాగనుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు తలెత్తనీకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. రద్ధీ సమయంలో తొక్కిసలాలేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఏటా మొదటి రెండు రోజులు భవానీల సంఖ్య కొద్దిగా తక్కువ. అయితే, చివరి మూడు రోజులు మాత్రం భారీగా తరలివస్తారు. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తిచేశారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుర్గగుడి ఈవో బ్రమరాంభ, ఎగ్జి్క్యూటివ్ ఇంజినీరు రమాదేవి, ఏసీపీ హనుమంతరావులతో సమీక్షించారు. అమ్మవారి దర్శనం, గిరి ప్రదక్షిణ, హోమ గుండాలు, మాల విరమణ, ఇరుముడులు సమర్పించేచోట ఇబ్బందులు తలెత్తనీకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

గిరి ప్రదక్షిణ చేసే భవానీ భక్తులకు, కాలినడకన వచ్చే వారికి రోడ్లల్లో గుంతల్లేకుండా నగరపాలక సంస్థ పక్కా ఏర్పాట్లు చేసింది. ఒంటిపూట ఆహారం తీసుకుని దీక్షలో ఉన్న భక్తులు ఇంద్ర కీలాద్రి చేరుకోగానే దేవస్థానం తరఫున అన్నప్రసాదాలను పంపిణీచేయాలని నిర్ణయించారు. దేవస్థాన ప్రసాదాలకోసం భవానీ దీక్షపరులు ఎగబడే సమయంలో తొక్కిసలాట జరిగిన అనుభవాలను దృష్టిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

నిత్యం అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకోసం ఆర్టీసీ బస్టేషన్, రైల్వేస్టేషన్ పరిసరాలనుంచి ఉచిత బస్సుల యధావిధిగా బయలుదేరే విధంగా దేవస్థాన అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవస్థానం వచ్చిన భక్తులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ శాఖల అధికారులు భవానీ దీక్షల విమరణ విధుల్లో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News