టీడీపీ ఆరోపణలపై పోలీస్ అసోసియేషన్ సమాధానం

Update: 2019-12-01 02:33 GMT

మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతి పర్యటన సందర్భంగా కాన్వాయ్‌పై దాడి చేసిన విషయంలో డీజీపీ డి. గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎపిపిఓఎ) శనివారం ఖండించింది. ఎపిపిఓఎ అధ్యక్షుడు జె.శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఎండి మస్తాన్ ఖాన్, సంయుక్త కార్యదర్శి బండారు యేసు తదితరులు ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి,చంద్రబాబు వాహనంపై చెప్పులు, రాళ్లను విసిరేందుకు పోలీసులు గ్రామస్తులకు అనుమతి ఇచ్చారని కొందరు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఎపిపిఒ తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస రావు తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా టీడీపీ నాయకులు పోలీసులను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

డీజీపీ, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని పోలీసులు అప్పటికే టీడీపీ నాయకులకు తెలియజేశారని, అమరావతి పర్యటనను రద్దు చేయాలని అభ్యర్థించారన్నారు. ఎపిపిఓఎ ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ పోలీసులు కూడా సమాజంలో భాగమే. టీడీపీ నాయకులను వారి వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. హింసను ప్రోత్సహించడం పోలీసుల సంస్కృతి కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంపై లాఠీ కూడా విసిరినట్లు టీడీపీ ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. 

Tags:    

Similar News