ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణతో అనుమతిలేని ఇళ్లకు క్రమబద్దీకరణ అవకాశం

ఏపీ ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలుకు సిద్ధమవుతోంది. 24వ తేదీన కేబినెట్ ఆమోదం తర్వాత అనుమతిలేని భవనాలు, లేఅవుట్లను క్రమబద్దీకరించనుంది.

Update: 2025-07-22 06:19 GMT

AP Govt’s Key Decision: BPS & LRS Revival to Legalize Unauthorized Constructions

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పునరుద్ధరణ దిశగా అడుగులు వేసింది. ఈ రెండు పథకాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు జూలై 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలు ఉంచనున్నారు. కేబినెట్ ఆమోదం అనంతరం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

2014–2019 మధ్య కాలంలో ఈ రెండు పథకాలను అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టగా, సమయ పరిమితి ముగియడంతో నిలిపివేశారు. అయితే, అప్పటి దరఖాస్తుల్లో బీపీఎస్‌కు 90 శాతం, ఎల్ఆర్ఎస్‌కు 65 శాతం వరకు పరిష్కారం అయ్యింది.

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున భవనాలు, లేఅవుట్లు అభివృద్ధి చెయ్యబడ్డాయి. ఇటీవల ఇంటింటి సర్వేలో రాష్ట్రంలోని 123 పురపాలక సంస్థల్లో 30,065 ఇళ్లకు ఆస్తిపన్ను విధించని విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే, 20,000 పైగా లేఅవుట్లు అనుమతుల్లేకుండా అభివృద్ధి అయినట్లు అంచనా.

నెల్లూరు, చిత్తూరు, కడప, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి వంటి జిల్లాల్లో ఎక్కువగా ఇలాంటి లేఅవుట్లు నమోదయ్యాయి. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ప్లాట్‌దారులకు తమ ఆస్తులను చట్టబద్ధంగా మార్చుకునే అవకాశం ఏర్పడనుంది.

ఇక భవిష్యత్‌లో ఈ పథకాల అమలుతో అనుమతుల్లేని భవనాలు, ప్లాట్లకు చట్టబద్ధత వచ్చి, పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. ప్రజలు కూడా తమ ఆస్తులపై పూర్తి హక్కుతో బ్యాంకు లోన్లు పొందగలుగుతారు.

Tags:    

Similar News