స్థానిక సమరం పై రమాకాంత్ రెడ్డితో ఏపీ సర్కార్ భేటి

ఏపీలో ప్రభుత్వానికి, ఈసీకి మధ్య కరోనా చిచ్చు రేగింది.. వైరస్ భయంతో స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా వాయిదా వేసిన ఈసీ పై పోరాటానికి దిగిన ఏపీ కోర్టు తలుపు తట్టింది

Update: 2020-03-16 15:33 GMT
Cm jagan (File photo)

ఏపీలో ప్రభుత్వానికి, ఈసీకి మధ్య కరోనా చిచ్చు రేగింది.. వైరస్ భయంతో స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా వాయిదా వేసిన ఈసీ పై పోరాటానికి దిగిన ఏపీ కోర్టు తలుపు తట్టింది. అంతే కాదు సకాలంలో ఎన్నికల నిర్వహణకు కసరత్తూ చేస్తోంది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ఉమ్మడి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని పిలిపించుకుని జగన్ మంతనాలు జరిపారు. జగన్ ఆగ్రహావేశాల తర్వాత స్థానిక సమరం ఏ రూపు తీసుకుంది?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా పెట్టిన చిచ్చు కొనసాగుతోంది. ఈసీ ఏకపక్ష నిర్ణయంపై మండిపడిన జగన్ ఎన్నికల కోసం తమ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందన్నారు.అన్నట్లుగానే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఇటు హై కోర్టు, అటు సుప్రీంకోర్టు తలుపుకూడా తట్టింది.. ఎన్నికల సత్వర నిర్వహణకు అందుబాటులో ఉన్న అన్ని పోరాట మార్గాలను వైసీపీ ప్రభుత్వం వినియోగించుకుంటోంది.. జగన్ ఫిర్యాదు చేసిన 24 గంటలు గడవకుండానే ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలిశారు.

దాదాపు గంటన్నర పాటూ ఏకాంతంగా సమావేశమైన నిమ్మగడ్డ తన నిర్ణయాలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారని సమాచారం. తానెందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండా ఆయన వెళ్లిపోయారు. భేటీపై మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ అలాంటి సమాచారమేదీ రాలేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఇదే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తున్నట్లు హై కోర్టు ప్రకటించింది. మరోవైపు సుప్రీం కోర్టులోకూడా ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న స్థానిక ఎన్నికలపై కనీసం హై కోర్టుకు, ప్రభుత్వానికి,సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం కంప్లయింట్ చేసింది.ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News