AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్..ఆగస్టు 15 నుండే ఫ్రీ బస్

AP Free Bus Scheme: AP Free Bus Scheme: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2025-06-28 15:54 GMT

AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్..ఆగస్టు 15 నుండే ఫ్రీ బస్

AP Free Bus Scheme: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ పెరుగుదల దృష్ట్యా బస్సుల సంఖ్య పెంపు

ఈ పథకం వల్ల RTC బస్సుల ఆక్యుపెన్సీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, అదనంగా బస్సులను నడపాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే కొత్త బస్సుల కొనుగోలు లేదా అద్దెకు తీసుకోవాలని, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మరియు ఇకపై కొనుగోలు చేసే అన్ని RTC బస్సులు ఈవీ (ఎలక్ట్రిక్) ఏసీ బస్సులే కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను కూడా ఈవీగా మార్చే అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి బస్సులో GPS వ్యవస్థ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.

ఆర్థిక కష్టాల మధ్య హామీ నెరవేర్చే దిశగా రాష్ట్రం

“ఆర్థికంగా కష్టాలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ప్రతీ రూపాయికి విలువ ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, వ్యయాన్ని తగ్గించుకోవాలి” అని ముఖ్యమంత్రి అధికారులను దిశానిర్దేశం చేశారు. బస్సు స్టేషన్ల శుభ్రత, టాయిలెట్లు, తాగునీరు వంటి ప్రాథమిక వసతులను మెరుగుపరచాలని స్పష్టం చేశారు.

బస్సు నిర్వహణ వ్యయం తగ్గించేందుకు కొత్త ఆలోచనలు

RTC నిర్వహణలో ఖర్చు తగ్గించే బ్యాటరీ స్వాపింగ్, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, సర్వీస్ స్టేషన్ల ప్రైవేటీకరణ తదితర అంశాలపై పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. RTC స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి EV బస్సులు నడిపితే ఎంత మేరకు నిర్వహణ ఖర్చు తగ్గుతుందనేదానిపై అధ్యయనం చేయాలన్నారు.

పథకానికి అదనంగా 2,536 బస్సులు అవసరం

ఈ పథకం అమలుకు అదనంగా 2,536 RTC బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వాటి కోసం రూ. 996 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు, డిజిటల్ సమాచారం బోర్డులు తదితర సౌకర్యాల పెంపుపై కూడా దృష్టి సారించారు.

ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించనున్న మహిళలు

ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల జనాభా సుమారు 2.62 కోట్లు. వారిలో పల్లె వెలుగు, సిటీ బస్సుల ద్వారా ప్రయాణించే వారిని లెక్కిస్తే, ఇప్పుడున్న వార్షిక ప్రయాణ సంఖ్య 43 కోట్లకు పైగా ఉంది. ఉచిత బస్సు పథకం అమలైతే, ఇది 75 కోట్లకు పైగా చేరనుందని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణాల సంఖ్య కూడా 6.85 కోట్ల నుంచి 13.39 కోట్లకు పెరిగే అవకాశముంది. మొత్తం మీద ఈ పథకం ద్వారా మహిళలు ఏడాదికి 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుంటుందని అంచనా.

ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన అమలు విధానం లక్ష్యం

ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉంది. అయితే ఆ విధానాల కంటే మెరుగ్గా, సౌకర్యవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కేంద్రం అందజేసిన 750 ఈవీ బస్సులు

గతంలో కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం 750 ఈవీ బస్సులను అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ పథకం కింద కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని బస్సుల్లో 57 శాతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులే ఉండటం గమనార్హం.

ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలకు నిత్య ప్రయాణాల్లో ఆర్థిక ఉపశమనం లభించనుండటం ఖాయం. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు మహిళల సాధికారత వైపు ఒక పెద్ద అడుగుగా నిలవనున్నాయి.

Tags:    

Similar News