ఏపీలో పోలింగ్ రోజు గందరగోళ పరిస్థితులపై సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సీరియస్

Update: 2019-04-17 14:15 GMT

ఏపీలో పోలింగ్ రోజున తలెత్తిన గందరగోళ పరిస్థితులపై సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. పోలింగ్ నిర్వహణలో కలెక్టర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ రోజున జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలన్నారు. నియోజకవర్గానికి ముగ్గురు భేల్ ఇంజనీర్లను కేటాయించినా..వారి సేవల్ని ఉపయోగించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది ఇంజనీర్లు వచ్చినా..కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.

ఈవీఎంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించటంతో అందుబాటులో ఉన్న ఇంజనీర్లను వాడుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది సీఈవో ద్వివేది ఆరోపణ. అంతేకాదు అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిన పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నారాయన. సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ కొనసాగించటానికి గల కారణాలను రాతపూర్వకంగా వివరించాలని కలెక్టర్లను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో ఆర్వో ఈవీఎంలను ఆలస్యంగా అప్పగించిన ఘటనతో పాటు రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో నివేదిక పంపాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. 

Similar News