AP DSC 2025 Online Application: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు పెద్ద టెన్షన్ తప్పింది
AP DSC 2025 Online Application: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే విధానంతో పాటు అర్హతల విషయంలో పెద్ద టెన్షన్ తప్పింది.
Changes in AP DSC 2025 Online Application process
ఏపీలో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు సర్కారు భారీ ఊరటనిచ్చింది. డీఎస్సీ దరఖాస్తులో తలెత్తుతున్న సమస్యలపై కొంతమంది అభ్యర్థులు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి అభ్యర్థనలను విన్న ప్రభుత్వం తాజాగా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా (గతంలో ట్విటర్) అభ్యర్థులకు తెలియజేశారు.
మంత్రి లోకేష్ ప్రస్తావించిన అంశాల్లో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, అప్లికేషన్ రెండో భాగంలో అభ్యర్థులు సర్టిఫికెట్స్ సబ్‌మిట్ చేయడం ప్రస్తుతానికి తప్పనిసరి కాదన్నారు. ప్రస్తుతానికి అది ఆప్షనల్ మాత్రమేనన్న లోకేష్... సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం తప్పనిసరిగా ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుందన్నారు.
ఇదివరకు సర్టిఫికెట్స్ సబ్‌మిట్ చేయడం తప్పనిసరి కావడంతో అభ్యర్థులు ఆయా సర్టిఫికెట్స్ కోసం కార్యాలయాలు, కాలేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవైపు జూన్ 6 నుండి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన సమయంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్స్ కోసం తిరగాల్సి వస్తోందంటూ అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. ఆ ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక రెండో పాయింట్ విషయానికొస్తే... డీఎస్సీ రాసేందుకు డిగ్రీ, పీజీల్లో వచ్చిన మార్కుల అర్హతలను టీఈటీ అర్హతలకు సమానం చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఎందుకంటే డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని టెట్ పరీక్షలు రాసి డీఎస్సీకి అర్హతలు సాధించిన కొంతమంది అభ్యర్థులు డీఎస్సీ అర్హతలకు అవసరమైన మార్కులు లేని కారణంగా డీఎస్సీకి అనర్హులుగా మిగిలిపోయారు. అలాంటి అభ్యర్థులు ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. "టెట్ రాసేందుకు అవకాశం ఇచ్చి, ఇప్పుడు డీఎస్సీకి అర్హులు కాదనడం ఎలా న్యాయం" అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో డీఎస్సీ అర్హతకు అవసరమైన మార్కులను కూడా టెట్‌కు సరిసమానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం మార్పులుచేర్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అప్లికెంట్స్‌కు ఇబ్బందులను తగ్గించింది.