అధికార వైసీపీలో ఆరంభమైన అలజడికి తాత్కాలిక తెర.. బాలినేనికి జగన్ భరోసా...

YS Jagan - YSRCP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదన్న బాలినేని...

Update: 2022-04-13 02:10 GMT

అధికార వైసీపీలో ఆరంభమైన అలజడికి తాత్కాలిక తెర.. బాలినేనికి జగన్ భరోసా...

YS Jagan - YSRCP: అధికార వైసీపీలో ఆరంభమైన అలజడికి తాత్కాలికంగా తెరపడింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కొత్త మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తూనే అలకబూనిన బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి భరోసా ఇవ్వటం ద్వారా సీఎం జగన్‌ అలజడికి తెరదించారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించక అగ్గిమీద గుగ్గిలం అయిన బాలినేని సీఎం జగన్‌ను కలిశారు. అప్పటిదాకా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ దుమారాన్ని చలార్చారు మాజీ మంత్రి బాలినేని. అంతకుముందు సురేష్‌ తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో జిల్లాలో మాజీ మంత్రి బాలినేనికి మద్దతుగా అనుచరులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

భారీ సంఖ్యలో పదవులకు రాజీనామాలు చేశారు. పెద్దఎత్తున విజయవాడ తరలివెళ్లి బాలినేనిని కలిసి మద్దతు ప్రకటించారు. ఇంకోవైపు అసంతృప్తితో ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ నిర్ణయాన్ని గౌరవిద్దాం.. ఎలా న్యాయం చేస్తారో వేచి చూద్దాం అంటూ అనుచరుల ఆందోళనకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే మంత్రివర్గంలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవటంపై కంభంలో ఆర్యవైశ్యులు నిరసన చేపట్టడం అందుకు జిల్లాలోని అన్నిప్రాంతాల ఆ వర్గీయులు మద్దతు పలికారు.

ఆదిమూలపు సురేష్‌కు కొత్త మంత్రివర్గంలోనూ సముచిత స్థానం దక్కింది. అదే సమయంలో ప్రాధాన్యం గల పురపాలక శాఖను ఆయనకు కేటాయించారు. ఉన్నత విద్యావంతుడైన సురేష్‌ 2008లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2009ఎన్నికల్లో వైపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎస్‌ఎన్‌పాడు నుంచి పోటీచేసి స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఆ టర్మ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం అధినేత ఆదేశాలతో వైపాలెం పార్టీ బాధ్యతలు స్వీకరించారు.

గత ఎన్నికల్లో అక్కడ గెలిచి మంత్రి అయ్యారు. కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తూ సీఎం దృష్టిని ఆకర్షించారు. దళితులలో ప్రత్యేకించి మాదిగ సామాజికవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆ రెండు విషయాల్లో సురేష్‌ ముందున్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో స్థానం లేదని తెలిసినప్పటి నుంచి బాలినేని అసంతృప్తితో ఉన్నారు. దీంతో తాడేపల్లిలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరుగుతుండగా జిల్లాలో బాలినేని మద్దతుదారులు నిరసనలు నిర్వహించారు. బాలినేని కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ సమయంలో విజయవాడలో బాలినేనితో సజ్జల, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మరో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సమావేశమై చర్చలు జరిపారు. దీనికి తోడు ఉమ్మడి జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, తదితరులు బాలినేనిని కలిసి నిర్ణయం మార్చుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో సీఎం ప్రతినిధులుగా వచ్చిన బృందంతో కలిసి బాలినేని సీఎం క్యాంపు ఆఫీసుకి వెళ్లి జగన్‌ను కలిశారు. కొంతసేపు ఏకాంతంగాను, ఆ తర్వాత కొంతసేపు సజ్జల మరికొందరు సమక్షం లోను బాలినేనితో సీఎం మాట్లాడినట్లు సమాచారం.

అనంతరం తనకు పార్టీ, జగన్‌ ఆలోచనలు ముఖ్యమని తదనుగుణంగా నడుచుకుంటానని ప్రకటించారు. తనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని, తనకోసం రాజీనామా చేసినవారు కూడా వెనక్కు తీసుకునేలా చూస్తానన్నారు. భవిష్యత్తుపై సీఎం పూర్తి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో మీడియాతో బాలినేని మాట్లాడేటప్పుడు ఆయన ముఖ కవలికల్లో బాధ కనిపించింది తప్ప ఒక్కసారి కూడా చిరునవ్వు లేదు. అయితే సీఎం నిర్ణయమే శిరోధార్యమంటూ రాజీనామాలు చేసిన తన మద్దతుదారులంతా కూడా వాటిని వెనక్కు తీసుకుంటారని ప్రకటించారు. ఆ తర్వాత తన ఇంటి వద్ద ఉన్న జిల్లాలోని పార్టీ మద్దతుదారులందరికీ నచ్చజెప్పి వెనక్కు పంపారు. 

Tags:    

Similar News